
Sahkar Taxi: ఓలా, ఉబర్‌లకు పోటీగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకార్ యాప్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడ్-హెయిలింగ్ సేవల వినియోగం విపరీతంగా పెరిగింది.
గణనీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కంపెనీలు వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నాయి.
అయితే, ఆ మొత్తాన్ని పూర్తిగా డ్రైవర్లకు అందజేయడం లేదు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన చార్జీల్లో భారీ కోత విధించి మిగిలిన మొత్తం మాత్రమే డ్రైవర్లకు చెల్లిస్తున్నారు.
ఈ వ్యవస్థపై డ్రైవర్లు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకొచ్చింది.
'సహకార్ ట్యాక్సీ' పేరుతో కొత్త యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అధికారికంగా ప్రకటించారు.
వివరాలు
డ్రైవర్లకు నేరుగా లాభాలు
ప్రధానంగా డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సహకార-ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు నమోదయ్యే అవకాశం ఉంటుంది.
"ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, దీనిని భౌతికంగా అమలు చేయడానికి గత మూడు సంవత్సరాలుగా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.
త్వరలోనే, డ్రైవర్లకు నేరుగా లాభాలు అందించే విధంగా ఈ సేవను ప్రారంభిస్తాం," అని అమిత్ షా తెలిపారు.
ఇటీవల ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారుల మధ్య చార్జీల వ్యత్యాసంపై వచ్చిన నివేదికల నేపథ్యంలో, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఓలా, ఉబర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.
వివరాలు
అందరికీ సమానమైన చార్జీలు
అయితే, ఓలా ఈ ఆరోపణలను ఖండిస్తూ, "మా ప్లాట్‌ఫామ్‌లో ఫోన్ మోడల్ ఆధారంగా ధరలు నిర్ణయించము, అందరికీ సమానమైన చార్జీలు ఉంటాయి," అని స్పష్టీకరించింది.
ఉబర్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెట్టడం వల్ల, ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.