Adhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం
వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా, రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డులను వచ్చే నెల నుంచి జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంబంధిత విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన అగ్రి-టెక్ సమ్మిట్, స్వరాజ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబరు మొదటివారంలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మార్చి 2024 నాటికి 5 కోట్ల మంది రైతులకు ఈ గుర్తింపు సంఖ్యను ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
వ్యవసాయ రంగం డిజిటైజేషన్ కోసం కేంద్ర కేబినెట్ రూ. 2,817 కోట్ల నిధులకు ఆమోదం
వ్యవసాయ రంగం డిజిటలీకరణ పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేసినట్లు చతుర్వేది తెలిపారు. ఇంకా 19 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఆధార్ తరహా గుర్తింపు కార్డులు అందిస్తామని, ఈ ప్రత్యేక సంఖ్యతో రైతులు ప్రభుత్వ పథకాలను సులభంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ ఐడీ కార్డుతో, కనీస మద్దతు ధర, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి సేవలను రైతులు పొందగలరని వివరించారు. వ్యవసాయ రంగం డిజిటైజేషన్ కోసం ఇటీవల కేంద్ర కేబినెట్ రూ. 2,817 కోట్ల నిధులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రిజిస్ట్రీ ద్వారా సేకరించిన డేటా, ప్రభుత్వానికి విధాన రచన,సేవల నిర్వహణలో సహాయపడుతుందని చతుర్వేది తెలిపారు.
రిజిస్ట్రేషన్ డ్రైవ్ కోసం దేశవ్యాప్తంగా క్యాంపులు
'ప్రస్తుతం, రైతులు ఏదైనా వ్యవసాయ పథకం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ వెరిఫికేషన్‌కు వెళ్లాలి.. దీనికి ఖర్చు మాత్రమే కాకుండా కొంత వేధింపులు కూడా ఉంటాయి.. ఈ సమస్యను పరిష్కారానికి మేము రైతుల రిజిస్ట్రీని రూపొందించబోతున్నాం' అని వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ వద్ద ఉన్న డేటా కేవలం వ్యవసాయ భూములు, పంటల వివరాలకు పరిమితమైందని, వ్యక్తిగత రైతులపై పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ఈ రిజిస్ట్రీ అవసరమని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ కోసం దేశవ్యాప్తంగా క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు, కిసాన్ ఏఐ చాట్‌బాక్స్ వంటి సాంకేతికతలను వ్యవసాయ రంగంలోకి తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపడుతుందని, రైతుల మద్దతు అత్యంత అవసరమని తెలిపారు.