LOADING...
credit guarantee scheme: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: ఎంఎస్‌ఎంఈలకు కేంద్రం రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌!
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం

credit guarantee scheme: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: ఎంఎస్‌ఎంఈలకు కేంద్రం రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ప్రభావిత రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) దెబ్బతినకుండా కాపాడేందుకు రూ.2.5 లక్షల కోట్ల పరిమాణంలో భారీ క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం కింద బ్యాంకులు వ్యాపారాలకు ఇచ్చే రుణాలకు ప్రభుత్వం హామీగా నిలుస్తుంది. వ్యాపారాలు నష్టాల్లో పడటం వల్ల అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే, ప్రభుత్వం 90 శాతం వరకు గ్యారెంటీ ఇస్తుంది. అయితే,ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా రూ.100కోట్ల వరకు మాత్రమే ఈ హామీ వర్తిస్తుంది.

వివరాలు 

పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణాలు

ఈ గ్యారెంటీని ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (NCGTC) ద్వారా అమలు చేయనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం సుమారు రూ.17 వేల నుంచి రూ.18 వేల కోట్ల వరకు వ్యయం చేయనుంది. ఇలాంటి విధానాన్ని కేంద్రం గతంలో కొవిడ్-19 సమయంలో కూడా అమలు చేసింది. 2020లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ను ప్రవేశపెట్టి,ఎంఎస్‌ఎంఈలు సహా వివిధ రంగాల వ్యాపారాలకు మద్దతు ఇచ్చింది. ఆ పథకం కింద ఇచ్చిన రుణాలకు 100శాతం ప్రభుత్వ గ్యారెంటీ ఉండేది. అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చినా బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది. అంతేకాకుండా పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణాలు అందించడం జరిగింది.

వివరాలు 

క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్న కేంద్రం 

ప్రస్తుతం యుద్ధ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా ముందస్తు చర్యలుగా కేంద్రం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన చమురు ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌పై రూ.10 వరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అలాగే డీజిల్‌పై లీటరుకు రూ.21.50, విమాన ఇంధనమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై లీటరుకు రూ.29.50 ఎగుమతి సుంకాన్ని విధించింది. ముఖ్యమైన పెట్రో కెమికల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని కూడా మినహాయించింది. ఇక తాజాగా యుద్ధ ప్రభావిత రంగాలకు ప్రత్యక్ష మద్దతుగా ఈ క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రభావిత రంగాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Advertisement