DA Hike: డీఏ హైక్‌కు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కరవు భత్యం (DA Hike)ను 2 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ డీఏను అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతేడాది జనవరి, జులై నెలల్లో రెండు సార్లు డీఏను సవరిస్తుంది. అయితే ఈసారి డీఏ పెంపు ప్రకటన ఆలస్యమవడంతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన నెలకొంది.
వివరాలు
13వేల కోట్ల నిధులు కేటాయింపు
ఇదే క్యాబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయానికి కూడా ఆమోదం లభించింది. సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి రూ.13 వేల కోట్ల నిధులు కేటాయించనున్నారు. ఈ ఫండ్ ద్వారా భారత జెండా కలిగిన నౌకలు, అలాగే భారత్ నుంచి రాకపోకలు సాగించే నౌకలకు బీమా కవరేజీ అందించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో రవాణా నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.