
GST cut: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ధరల తగ్గింపును పర్యవేక్షిస్తున్నకేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్‌టీ 2.0 అమలులోకి రాకటంతో నిత్యావసరాల నుండి కార్ల వరకు పన్నుల భారాన్ని తగ్గించడం వల్ల వినియోగదారులకు భారీగా సొమ్ము ఆదా కానుంది. అయితే, కొన్ని ఈ-కామర్స్ వేదికలు ఈ పన్ను తగ్గింపును సరైన రూపంలో వినియోగదారులకు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఫిర్యాదుల విషయంలో ప్రాథమిక పరిశీలన జరుగుతుండగా, సెప్టెంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో జీఎస్‌టీ అమలుపై పూర్తి నివేదిక అందనుందని వెల్లడించారు. "ధరల మార్పును పర్యవేక్షిస్తున్నాం. ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వలేము, కానీ పరిశీలన పూర్తి చేసిన తర్వాత చర్యలు తీసుకుంటాం" అని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
375 రకాల వస్తువులపై జీఎస్‌టీ రేట్లు తగ్గాయి
జీఎస్‌టీ 2.0 సోమవారం నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది. దీనివల్ల కిరాణా, గృహావసర సరుకులపై ఖర్చులు సుమారు 13% తగ్గనుండగా, ఒక చిన్న కారు కొనుగోలు చేస్తే సుమారు 70,000 రూపాయల వరకు ఆదా పొందవచ్చని అంచనా ఉంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం, స్టేషనరీ, దుస్తులు, పాదరక్షలు, ఔషధాలు వంటి 7-12% ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే, వ్యక్తిగత ఆరోగ్య మరియు జీవిత బీమా పాలసీలపై ఉన్న 18% పన్ను తొలగించడంతో కూడా వినియోగదారులకు అదనంగా లాభం ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం 375 రకాల వస్తువులపై జీఎస్‌టీ రేట్లు తగ్గాయి.