Page Loader
GST GoM: ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం..ఆదాయాన్ని  పెంచడమే లక్ష్యం 
ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం

GST GoM: ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం..ఆదాయాన్ని  పెంచడమే లక్ష్యం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరలపై జీఎస్‌టీ తగ్గించాలని నిర్ణయించింది. ఇందులో ముఖ్యంగా 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్లు, ఎక్సర్‌సైజ్‌ నోట్‌బుక్‌లు ఉన్నాయి. అదే సమయంలో, రిస్ట్ వాచీలు, బూట్లపై జీఎస్‌టీ పెరిగినట్లు కూడా ఒక అధికారి తెలిపారు. బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్న మంత్రుల బృందం నిర్ణయంతో సుమారు రూ. 22,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా 20 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు.

వివరాలు 

సామాన్యులకు కొంత ఉపశమనం

ఈ ప్రతిపాదనకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే, రూ. 10,000 కంటే తక్కువ ధర కలిగిన సైకిళ్లపై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది. ఎక్సర్‌సైజ్‌ నోట్‌బుక్‌లపై కూడా 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్‌టీ తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది. మరోవైపు, రూ. 15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు, రూ. 25,000 కంటే ఎక్కువ ధర ఉన్న రిస్ట్ వాచీలపై జీఎస్‌టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు. ఈ రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయాలు సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించనున్నాయని అధికారులు చెప్పారు.

వివరాలు 

నాలుగు ప్రధాన శ్లాబుల్లో జీఎస్‌టీ 

సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించిన జీఎస్‌టీ రేట్లపై చర్చ జరిగింది. ఇందులో హెయిర్ డ్రైయర్‌లు, హెయిర్ కర్లర్‌లపై 18 శాతం రేటు ఉన్నా, వాటిని 28 శాతం శ్లాబ్‌లోకి చేర్చనున్నట్లు కూడా వెల్లడించారు. ప్రస్తుతం జీఎస్‌టీ నాలుగు ప్రధాన శ్లాబుల్లో ఉంది - 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. కొన్ని వస్తువులకు తక్కువ శ్లాబుల్లో జీఎస్‌టీ ఉంటే, మరికొన్నింటికి ఎక్కువ శ్లాబ్‌లో ఉంది. కొన్ని ప్రత్యేక వస్తువులకు సెస్ కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ల భీమా కవరేజీకి జీఎస్‌టీలో మినహాయింపు ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.