Madras HC: జీఎస్‌టీ సెక్షన్ 74పై కీలక తీర్పు.. నోటీసుకు పూర్తి రుజువులు అవసరం లేదన్న మద్రాస్ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్‌టీ చట్టంలోని మోసం (Fraud) కేసులకు సంబంధించిన నోటీసుల విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీజీఎస్‌టీ చట్టం-2017లోని సెక్షన్ 74 కింద షోకాజ్ నోటీసు జారీ చేయాలంటే అధికారులు ముందుగానే మోసాన్ని పూర్తిగా నిరూపించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, కేవలం అనుమానాల ఆధారంగా మాత్రం నోటీసులు ఇవ్వకూడదని కూడా పేర్కొంది. M/s Fastenex Private Limited vs State Tax Officer తదితర కేసులను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.సరవణన్ ఈ తీర్పు వెలువరించారు.
వివరాలు
ఆరోపణలు నిజమా కాదా..
అధికారుల వద్ద ఉన్న రికార్డులు,తనిఖీలు,ఆడిట్ లేదా దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా పన్ను చెల్లించకపోవడం,తక్కువగా చెల్లించడం లేదా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ను తప్పుగా పొందడం లేదా వినియోగించడం జరిగిందనే ప్రాథమిక అభిప్రాయం (Prima Facie Opinion) ఏర్పడితే సెక్షన్ 74 కింద నోటీసు జారీ చేయవచ్చని కోర్టు తెలిపింది.
అయితే, ఆ ఆరోపణలు నిజమా కాదా అన్నది నోటీసు అందుకున్న పన్ను చెల్లింపుదారుకు సమాధానం చెప్పే అవకాశం ఇచ్చిన తర్వాత జరిగే విచారణలోనే తేలుతుందని హైకోర్టు పేర్కొంది.
వివరాలు
సెక్షన్ 73, సెక్షన్ 74 మధ్య తేడా ఏమిటి?
సీజీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 73 ప్రకారం, మోసం,ఉద్దేశపూర్వక తప్పుడు ప్రకటన లేదా వాస్తవాలను దాచిపెట్టడం వంటి అంశాలు లేకుండానే పన్ను చెల్లించకపోవడం, తక్కువగా చెల్లించడం, పొరపాటున రీఫండ్ పొందడం లేదా ఐటీసీని తప్పుగా వినియోగించడం జరిగితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అదే సెక్షన్ 74 మాత్రం మోసం,ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం లేదా వాస్తవాలను దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్న సందర్భాల్లో వర్తిస్తుంది.
ఈ సెక్షన్ కింద కేసులకు ఎక్కువ కాలపరిమితి, కఠినమైన జరిమానాలు కూడా ఉంటాయి.
ఈ కేసులో పిటిషనర్లు,కేవలం ఆడిట్ నివేదికలు లేదా తనిఖీల ఆధారంగా సెక్షన్ 74 కింద నోటీసులు ఇవ్వడం చట్టబద్ధం కాదని,ముందుగా మోసం నిరూపించాల్సిందేనని వాదించారు.
వివరాలు
సెక్షన్ 73, సెక్షన్ 74 మధ్య తేడా ఏమిటి?
అయితే ఈ వాదనను హైకోర్టు తిరస్కరించింది.
సెక్షన్ 73, 74 రెండింటిలోనూ "Where it appears to the proper officer" అనే పదాలు ఉన్నాయని, అంటే అధికారికి అందుబాటులో ఉన్న ఆధారాలపై ప్రాథమిక అభిప్రాయం ఏర్పడితే సరిపోతుందని కోర్టు వివరించింది.
నోటీసు దశలోనే మోసాన్ని తుది స్థాయిలో నిరూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
కోర్టు చేసిన మరో కీలక వ్యాఖ్య
స్క్రూటినీ,ఆడిట్,తనిఖీ లేదా దర్యాప్తు సమయంలో సేకరించిన ఆధారాలను అధికారులు సెక్షన్ 74 కింద నోటీసు జారీ చేయడానికి ఉపయోగించవచ్చని హైకోర్టు పేర్కొంది.
అలాగే, ఆదాయపు పన్ను చట్టంలోని రీఅసెస్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలను జీఎస్‌టీ చట్టానికి యథాతథంగా వర్తింపజేయలేమని కూడా స్పష్టం చేసింది.
రెండు చట్టాల్లోని పదజాలం,నిబంధనలు భిన్నంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
వివరాలు
కోర్టు చేసిన మరో కీలక వ్యాఖ్య
అయితే, కేవలం అనుమానం లేదా ఊహాగానాల ఆధారంగా సెక్షన్ 74 నోటీసు జారీ చేయడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
అధికారుల ప్రాథమిక అభిప్రాయానికి రికార్డుల్లో ఉన్న ఆధారాలు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని పేర్కొంది. అదే సమయంలో, సీజీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 75(2)ను కూడా కోర్టు ప్రస్తావించింది.
సెక్షన్ 74 కింద నమోదైన కేసులో చివరకు మోసం ఆరోపణలు రుజువు కాకపోతే, ఆ కేసును సెక్షన్ 73 కింద విచారణగా పరిగణించాలని చట్టంలో స్పష్టంగా ఉందని హైకోర్టు గుర్తుచేసింది.