Binance: బైనాన్స్‌పై భారీ సైబర్ దాడి.. కేవలం రూ.1,300 ఖర్చుతో రూ.20 వేల కోట్ల క్రిప్టో చోరీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బైనాన్స్‌పై హ్యాకర్లు భారీ సైబర్ దాడికి పాల్పడ్డారు. కేవలం 15 డాలర్లు (సుమారు రూ.1,300) నెట్‌వర్క్ ఫీజు చెల్లించి ఏకంగా 2.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.20 వేల కోట్ల) విలువైన క్రిప్టోకరెన్సీని ఒకే లావాదేవీలో కొట్టేశారు. గత వారం జరిగిన ఈ దాడిలో మొత్తం 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు చోరీకి గురైయ్యాయి. బ్లాక్‌చెయిన్ భద్రతా సంస్థ బ్లాక్‌ఎయిడ్ ఈ లావాదేవీలను పరిశీలించి వివరాలను వెల్లడించింది.
వివరాలు
నకిలీ ఉద్యోగ ప్రకటనలతో హ్యాకర్ల చొరబాటు.. హాట్ వాలెట్ లక్ష్యంగా దాడి
హ్యాకర్లు ముందుగా నకిలీ ఉద్యోగ ప్రకటనలతో బైనాన్స్‌కు చెందిన ఓ ఇంజినీర్‌ను నమ్మించారు. అనంతరం అతనితో కంప్యూటర్‌లోకి చొరబడే ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయించారు.
అనంతరం బైనాన్స్ వినియోగదారుల విత్‌డ్రాయల్స్ కోసం ఉపయోగించే 'హాట్ వాలెట్' (Binance 14)ను లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ దాడిలో Ethereum నెట్‌వర్క్‌లో 2025 మేలో అమల్లోకి వచ్చిన EIP-7702 ఫీచర్‌ను ఉపయోగించుకున్నారు.
ఈ ఫీచర్ ద్వారా క్రిప్టో వాలెట్ తరఫున సాఫ్ట్‌వేర్ లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వవచ్చు.
దీన్ని ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు కేవలం 15 డాలర్ల నెట్‌వర్క్ ఫీజుతో అనుమతులు పొంది, మూడున్నర నిమిషాల వ్యవధిలోనే సుమారు 2.5 బిలియన్ డాలర్ల క్రిప్టో ఆస్తులను ఒకే లావాదేవీలో బదిలీ చేశారు.
వివరాలు
ఉత్తర కొరియాపై FBI అనుమానం
ఇందులో 1.6 బిలియన్ డాలర్ల విలువైన టెథర్ USDT కూడా ఉంది.
ఆ తర్వాత కూడా అదే అనుమతిని ఉపయోగించి మొత్తం సుమారు 3.6 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులను తరలించినట్లు బ్లాక్‌చైన్ విశ్లేషణ సంస్థ ఎలిప్టిక్ వెల్లడించింది.
ఈ ఘటనపై స్పందించిన బైనాన్స్.. ప్రభావిత వాలెట్ అనుమతులను రద్దు చేసి, భద్రతా వ్యవస్థలను పునర్నిర్మించినట్లు తెలిపింది.
వినియోగదారుల నిధులు సురక్షితంగానే ఉన్నాయని, ఈ ఘటన వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని సంస్థ భరించిందని స్పష్టం చేసింది.
కాగా, ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద క్రిప్టో చోరీగా భావిస్తున్న ఈ దాడి వెనుక ఉత్తర కొరియా ఉందని అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఆరోపించింది.
అయితే ఈ ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది.