HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోం
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు సమస్యలు తీవ్రంగా మారుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు అవసరమైన చోట ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులతో ప్రత్యక్ష సంబంధం లేని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పాటు ఇంటి నుంచే విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ విధానం వెంటనే అమల్లోకి వస్తుందని, ముందుగా నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వెల్లడించింది.
వివరాలు
ఈ ఉద్యోగులు మాత్రం యథావిధిగా కార్యాలయాలకు..
అనంతరం పనితీరు, సేవల ప్రభావాన్ని సమీక్షించి ఈ విధానాన్ని భవిష్యత్తులో కొనసాగించాలా వద్దా అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అంతర్గత విభాగాలైన నిధుల నిర్వహణ, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ సేవలు, మానవ వనరుల విభాగం, ఆర్థిక లెక్కల శాఖలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఖాతాదారులతో నేరుగా పని చేసే ఉద్యోగులు మాత్రం యథావిధిగా కార్యాలయాలకు హాజరవుతారని పేర్కొంది. ఇంటి నుంచే విధులు నిర్వహించే విధానం అమల్లోకి వచ్చినప్పటికీ బ్యాంకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని, వినియోగదారులకు అన్ని సేవలు సాధారణంగానే అందుబాటులో ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది.