Loading...
Reliance Satellite Network: అంతరిక్షం నుంచి హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌.. 1,600 ఉపగ్రహాల ప్రయోగానికి రిలయన్స్‌ సిద్ధం
అంతరిక్షం నుంచి హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌.. 1,600 ఉపగ్రహాల ప్రయోగానికి రిలయన్స్‌ సిద్ధం

Reliance Satellite Network: అంతరిక్షం నుంచి హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌.. 1,600 ఉపగ్రహాల ప్రయోగానికి రిలయన్స్‌ సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారతీయ ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చేందుకు రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అంతరిక్షం నుంచి హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు 1,600 ఉపగ్రహాలతో లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) వ్యవస్థను ఏర్పాటు చేయాలని రిలయన్స్‌ భావిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం దేశీయ, అంతర్జాతీయ తయారీ సంస్థలతో భాగస్వామ్యంపై చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ కథనం వెల్లడించింది.

వివరాలు

2035 నాటికి పూర్తి స్థాయిలో ఉపగ్రహ నెట్‌వర్క్

ఇటీవల లిస్టయిన జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ వృద్ధికి తోడ్పాటుగా ఈ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను 2035 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకోసం భారతీయ ఉపగ్రహ తయారీ సంస్థలు, టెక్నాలజీ స్టార్టప్‌లు, పెద్ద పారిశ్రామిక గ్రూపులతో సంప్రదింపులు జరుపుతోంది.

అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు సమకూర్చేందుకు కూడా సిద్ధమవుతోంది. ప్రస్తుతం భారత్‌ ఏడాదికి 15 కంటే తక్కువ ఉపగ్రహాలను మాత్రమే తయారు చేస్తోంది.

అయితే రిలయన్స్‌ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం దాదాపు 200 ఉపగ్రహాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

దీంతో దేశీయ ఉపగ్రహ తయారీ సామర్థ్యాన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఏర్పడనుంది.

వివరాలు

అమెరికా నుంచి 400 ఉపగ్రహాల సేకరణకు యోచన

ఈ ప్రాజెక్టులో దేశీయ తయారీతోపాటు విదేశాల నుంచి ఉపగ్రహాలను దిగుమతి చేసుకోవాలని రిలయన్స్‌ భావిస్తోంది.

అమెరికా నుంచి కనీసం 400 ఉపగ్రహాలను సేకరించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రెండు అమెరికా కంపెనీలతో పాటు యూరప్‌కు చెందిన సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది.

అయితే చైనా సంస్థలను మాత్రం ఈ ప్రాజెక్టు భాగస్వాముల జాబితా నుంచి పూర్తిగా మినహాయించింది.

సెప్టెంబర్‌ 2027లో తొలి ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించాలని రిలయన్స్‌ ప్రణాళిక రూపొందించింది. 2028 ఆరంభం నుంచి ఉపగ్రహ ప్రయోగాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు

స్టార్‌లింక్‌తో పోటీ కంటే దేశీయ అవసరాలకే ప్రాధాన్యం

ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్‌కు 10,000కు పైగా ఉపగ్రహాలు ఉన్నప్పటికీ.. రిలయన్స్‌ ప్రధానంగా భారతీయ కనెక్టివిటీ అవసరాలు, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలపై దృష్టి సారిస్తోంది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేదా యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు విదేశీ ఉపగ్రహ సేవలపై ఆధారపడకుండా దేశీయంగా పూర్తి నియంత్రణ కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది.

ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉపగ్రహాల తయారీ ఒక అంశమైతే.. వాటన్నింటినీ అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం మరో పెద్ద సవాలుగా మారనుంది.

ఇందుకు అవసరమైన రాకెట్‌ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించడమే భారత్‌ ముందున్న అతిపెద్ద సవాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT