LOADING...
PAN: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్…వారికి షాకింగ్ న్యూస్
ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్…వారికి షాకింగ్ న్యూస్

PAN: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్…వారికి షాకింగ్ న్యూస్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 22, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన గుర్తింపు సంఖ్య అయిన PAN‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. లావాదేవీల పరిమితులను పెంచుతూ కొత్త నియమాలను తీసుకువచ్చింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులో భాగంగా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను ప్రకటించింది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినా లేదా తీసుకున్నా PAN వివరాలు ఇవ్వాలి. ఇది ఒకేసారి చేసిన లావాదేవీ అయినా, విడతలుగా చేసినా వర్తిస్తుంది. ఒకే బ్యాంకులో గానీ, వేర్వేరు బ్యాంకుల్లో గానీ జరిగినా ఈ నిబంధన అమలులో ఉంటుంది.

వివరాలు

లావాదేవీలలో మార్పులు ఇలు..

ప్రస్తుతం ఒక రోజులో రూ.50 వేలకుపైగా లావాదేవీ జరిగితేనే PAN అడుగుతున్నారు. ఇల్లు, స్థలం కొనుగోలు లేదా అమ్మకం, గిఫ్ట్ లేదా జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ రూ.20 లక్షలు మించితే PAN తప్పనిసరి. ఇప్పటివరకు ఈ పరిమితి రూ.10 లక్షలు మాత్రమే. స్థిరాస్తి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిమితిని పెంచారు. ఇకపై ద్విచక్ర వాహనాలు సహా ఏ మోటారు వాహనం అయినా ధర రూ.5 లక్షలు దాటితే కొనుగోలుదారుడు PAN సమర్పించాలి. పాత నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలకు ఈ నియమం లేదు. కార్లు, ఇతర వాహనాలకు మాత్రం ధరతో సంబంధం లేకుండా PAN అవసరం ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షల పరిమితిని నిర్ణయించారు.

వివరాలు

హోటళ్లు, ఈవెంట్లు, రెస్టారెంట్లు..ఇక అది తప్పనిసరి

హోటళ్లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ హాల్స్ లేదా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చెల్లించే బిల్లులు రూ.1 లక్ష దాటితే PAN ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50 వేలుగా ఉంది. కొత్తగా దీనిని రెట్టింపు చేశారు. ఇప్పటివరకు బీమా పాలసీకి వార్షిక ప్రీమియం రూ.50 వేలకుపైగా ఉంటే మాత్రమే PAN అవసరం ఉండేది. ఇకపై ప్రతి బీమా పాలసీకి PAN సమర్పించడం తప్పనిసరి చేశారు. కొత్త నిబంధనలతో పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీలపై మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుంది. పారదర్శకత పెంచడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

Advertisement