HSBC: హెచ్ఎస్బీసీలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో వందలాది ఉద్యోగాలపై ప్రభావం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ హెచ్ఎస్బీసీ (HSBC) భారత్‌లో వందలాది ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తమ ఆర్థిక విభాగానికి (Finance Functions) సంబంధించిన కార్యకలాపాలను కొన్ని ప్రధాన నగరాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. చెన్నై, గురుగ్రామ్, బెంగళూరు నగరాల్లో ఈ విభాగాలను కేంద్రీకరించనుంది. దీంతో హైదరాబాద్, పుణె వంటి ఇతర కేంద్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని ఉద్యోగాలను తొలగించనుంది. ఈ విషయాన్ని సంస్థ ఉద్యోగులకు తెలియజేసినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని వేగంగా పెంచుకోవడంలో భాగంగానే హెచ్ఎస్బీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఉద్యోగులకు ఇతర నగరాలకు మారే అవకాశం
హెచ్ఎస్బీసీ భారత్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలోని ఆర్థిక విభాగం ఉద్యోగాలపైనే ఈ మార్పుల ప్రభావం ఉండనుంది.
ఈ పునర్వ్యవస్థీకరణ కారణంగా వందలాది ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగాలపై ప్రభావం పడే వారికి ఇతర నగరాల్లోని కేంద్రాలకు మారేందుకు సంస్థ సహకారం అందించనుంది.
ఇందుకోసం అవసరమైన తరలింపు సదుపాయాలు, ఇతర అవకాశాలను కల్పించనుంది.
అయితే నగరాలు మారే ఉద్యోగులకు అదనంగా నగదు ప్రోత్సాహకాలు మాత్రం ఇవ్వబోమని తెలుస్తోంది.
కార్యకలాపాలను మరింత సరళంగా మార్చడంతో పాటు, ఉద్యోగులను సరైన విభాగాల్లో నియమించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని హెచ్ఎస్బీసీ ప్రతినిధి వెల్లడించారు.
వివరాలు
ఏఐ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా 20 వేల ఉద్యోగాలకు ముప్పు!
హెచ్ఎస్బీసీ సీఈఓ జార్జెస్ ఎల్హెడరీ బ్యాంకులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.
కృత్రిమ మేధ (AI) సాయంతో కార్యకలాపాలను సరళీకరించి, నిర్వహణ ఖర్చులను తగ్గించడంపై దృష్టి సారించారు.
ఈ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 వేల ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా.
ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. అయితే ఈ మార్పులు జరుగుతున్నప్పటికీ భారత్ మాత్రం హెచ్ఎస్బీసీకి కీలక మార్కెట్‌గా కొనసాగుతోంది.
2025లో భారత్ ప్రాంతం నుంచి సంస్థ 1.9 బిలియన్ డాలర్ల పన్నులకు ముందు లాభాన్ని నమోదు చేసింది.
గత ఏడాది చివరి నాటికి భారత్‌లో సుమారు 47 వేల మంది ఉద్యోగులు హెచ్ఎస్బీసీలో పనిచేస్తున్నారు.
వివరాలు
ఇతర అంతర్జాతీయ బ్యాంకులూ ఇదే బాటలో..
హెచ్ఎస్బీసీ తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతున్నాయి.
భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఇతర ప్రపంచస్థాయి బ్యాంకులు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
గోల్డ్‌మన్ సాక్స్,జేపీమోర్గాన్ వంటి సంస్థలకు అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు భారత్‌లోనే ఉన్నారు.
అయితే ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో గతంలో ఉద్యోగులు చేసే అనేకపనులను సాంకేతికతతో పూర్తి చేస్తున్నాయి.
రుణ పత్రాల పరిశీలన,ఖాతాల లెక్కల సరిచూడటం,ప్రాథమిక స్థాయి కోడింగ్ వంటి పనులను ఏఐతో నిర్వహిస్తున్నాయి.
గతంలో ఈపనులే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతకు మంచి అవకాశాలను కల్పించేవి.
ఇప్పుడు ఏఐ వినియోగం పెరుగుతుండటంతో కొత్తగా ఉద్యోగాల్లోకి రావాలనుకునే వారికి అవకాశాలు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.