Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు భారీ ప్యాకేజీ.. రూ.6 వేల కోట్లకు పెంచిన ఆల్ఫాబెట్
ఈ వార్తాకథనం ఏంటి
సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీ భారీ పెంచింది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయన పారితోషికాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.6,361 కోట్లకు సమానం. ఈ విషయాన్ని ఓ నివేదిక వెల్లడించింది. ఈ వేతన ప్యాకేజీలో వార్షిక జీతం 2 మిలియన్ డాలర్లుగా నిర్ణయించగా, పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ (PSU) విలువను 126 మిలియన్ డాలర్లుగా ఖరారు చేశారు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన మేరకు ఈ మొత్తం మార్పు చెందుతుంది. అదనంగా పరిమిత స్టాక్ వెస్టింగ్ ద్వారా 84 మిలియన్ డాలర్లు పొందే అవకాశం ఉంది.
Details
ఉద్యోగులకు షేర్లు బదిలీలు
పరిమిత స్టాక్ వెస్టింగ్ అంటే కంపెనీ ఉద్యోగికి మంజూరు చేసే షేర్లు. పదవీకాలం పూర్తయిన తర్వాత లేదా పనితీరు ఆధారంగా ఈ షేర్లు ఉద్యోగికి బదిలీ అవుతాయి. ఇదికాకుండా ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థలైన వేమో, వింగ్ ఏవియేషన్‌లో 175 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కూడా పిచాయ్‌కు కేటాయించారు. ఈ రెండు సంస్థలకు ఆయన నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి ఈ ప్రోత్సాహకాలు నిదర్శనమని ఆల్ఫాబెట్ బోర్డు వెల్లడించింది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI)తో టెక్నాలజీ రంగం వేగంగా మారుతున్న సమయంలో పిచాయ్ నాయకత్వంపై బలమైన నమ్మకంతోనే ఈ వేతన పెంపును ప్రకటించినట్లు సంస్థ తెలిపింది.
Details
2015లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు
గూగుల్‌లో 2004లో చేరిన సుందర్ పిచాయ్, 2015లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో గత దశాబ్దంలో కంపెనీ మార్కెట్ విలువ ఏడు రెట్లు పెరిగింది. ఒకప్పుడు 535 బిలియన్ డాలర్లుగా ఉన్న సంస్థ విలువ ప్రస్తుతం 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది జనవరిలో ఒక దశలో అది 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా తాకింది.