Truth Social: ట్రంప్‌కు భారీ షాక్.. 'ట్రూత్ సోషల్'కు రూ.3,700 కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' భారీ ఆర్థిక నష్టాలను చవిచూసింది. ట్రూత్ సోషల్ మాతృసంస్థ అయిన 'ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్' (TMTG) తొలి త్రైమాసికంలో సుమారు 400 మిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.3,700 కోట్లకు సమానం. ఈ సంస్థలో ట్రంప్‌కు సుమారు 41 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. కంపెనీ విడుదల చేసిన అధికారిక ఫైలింగ్ ప్రకారం, మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో ట్రంప్ మీడియా ఆదాయం 1 మిలియన్ డాలర్ల కంటే తక్కువగానే నమోదైంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.8.74 కోట్లకు సమానం.
వివరాలు
భారీగా క్షీణించిన క్రిప్టోకరెన్సీ విలువలు
డిజిటల్ కరెన్సీ మార్కెట్‌లో చోటుచేసుకున్న భారీ పతనమే ఈ నష్టాలకు ప్రధాన కారణమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ విలువలు భారీగా క్షీణించడం కంపెనీపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో బిట్‌కాయిన్ విలువ 1,26,000 డాలర్లకు పైగా ఉండగా, మార్చి నాటికి అది 70,000 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర సుమారు 80,000 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రూత్ సోషల్ తొలి త్రైమాసికంలో కేవలం 9 లక్షల డాలర్ల ఆదాయాన్ని మాత్రమే ఆర్జించింది. అయితే మరోవైపు స్టాక్ మార్కెట్‌లో ట్రూత్ సోషల్ మార్కెట్ విలువ మాత్రం 2.47 బిలియన్ డాలర్లుగా నమోదైందని సమాచారం.
వివరాలు
ఆ కంపెనీతో వీలినంపై చర్చలు
ఈ భారీ నష్టాల నేపథ్యంలో భవిష్యత్తులో సంస్థ వృద్ధి అవకాశాలను పెంచడంతో పాటు వాటాదారులకు మరింత విలువ అందించే కొత్త వ్యూహాలపై దృష్టి సారించినట్లు ట్రూత్ సోషల్ సీఈఓ కెవిన్ మెక్‌గర్న్ తెలిపారు. అదే సమయంలో ట్రూత్ సోషల్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టి మరింత మంది వినియోగదారులకు సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన టీఏఈ టెక్నాలజీ కంపెనీతో వీలైనంత త్వరగా విలీనంపై చర్చలు జరుపుతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.