Stock Market: స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. 2200 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సరఫరా అంతరాయాల భయంతో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక బ్యారెల్‌కు సుమారు 3 శాతం పెరిగి 111 డాలర్లకు చేరాయి. దీని ప్రభావంతో భారత మార్కెట్లు భారీగా కుంగిపోయాయి. సెన్సెక్స్ 2200 పాయింట్లకు పైగా పతనమైంది. మధ్యాహ్నం 2:45గంటల సమయంలో సెన్సెక్స్ 2,289.22 పాయింట్లు పడిపోయి 74,397.52 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 655 పాయింట్ల నష్టంతో 23,122.30 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో రూపాయి విలువ కూడా మరింత బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 92.89కి చేరి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
Details
నష్టాల్లో 30 కంపెనీల షేర్లు
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎటర్నల్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు భారీగా పడిపోయాయి. మార్కెట్ పతనంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తగ్గి మదుపర్ల సంపద కరిగిపోయింది.
Details
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు
ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. దీంతో అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దాని ప్రభావం గురువారం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్ నిక్కీ 2.74%, దక్షిణ కొరియా కొస్పి 2.50% పతనమయ్యాయి. గత మూడు రోజులుగా లాభాల్లో కొనసాగిన సూచీలు, ఈరోజు లాభాల స్వీకరణ (profit booking) కారణంగా క్షీణించాయి. ప్రీ-ఓపెనింగ్ సెషన్‌లోనే సెన్సెక్స్ 1900 పాయింట్లకు పైగా పడిపోయింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై ఇరాన్ క్షిపణి దాడి జరపడం మార్కెట్లను మరింత కుదిపేసింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
Details
ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం
దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. ఈ రస్ లాఫాన్ గ్యాస్ క్షేత్రం నుంచి భారత్‌కు ఎరువులు, సీఎన్‌జీ, పీఎన్‌జీ అవసరాల కోసం భారీగా సరఫరా జరుగుతుంది. ముఖ్యంగా భారత్ దిగుమతి చేసుకునే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో దాదాపు 47% ఖతార్ నుంచే వస్తుండటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది.