Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జోరు.. ఇళ్ల విక్రయాలు 25% పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 2 శాతం మేర తగ్గినట్లు స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది. మార్కెట్‌లో గిరాకీ తగ్గడం, అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్ల సరఫరా తగ్గడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. ఈ మూడు నెలల కాలంలో మొత్తం 95,973 యూనిట్లు విక్రయాలు జరగగా, 2025 ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 98,095గా ఉంది. ఈ నివేదిక కోసం హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ-ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాలను పరిశీలించారు.
వివరాలు
ఈసారి 25శాతం వృద్ధి
నగరాల వారీగా చూస్తే, హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో 10,647 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 25 శాతం వృద్ధితో 13,297 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులో 15,603 యూనిట్లు, చెన్నైలో 4,774 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదైనట్లు ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది. కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ఇళ్ల సంఖ్య, అమ్ముడవుతున్న యూనిట్లకు దాదాపు సమానంగా ఉండటంతో అమ్ముడుపోని ఇళ్ల నిల్వ పెద్దగా పెరగలేదని నివేదిక స్పష్టం చేసింది.