Loading...
IBM: హెచ్ 1బీ,గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసిన ఐబీఎం!
హెచ్ 1బీ,గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసిన ఐబీఎం!

IBM: హెచ్ 1బీ,గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసిన ఐబీఎం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ టెక్కీలకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM) కీలక నిర్ణయంతో ఆందోళన మొదలైంది. తన అమెరికా కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్‌1బీ వీసా స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్‌కార్డ్ ప్రక్రియకు సంబంధించిన స్పాన్సర్‌షిప్‌ను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. పెరిగిన హెచ్‌1బీ వీసా ఫీజులు, పర్మ్ (PERM) ప్రక్రియలో తనిఖీలు కఠినతరం కావడం వంటి పరిణామాలు ఈ నిర్ణయానికి కారణాలుగా తెలుస్తోంది. ఈ ప్రభావం ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులపై పడనుంది.

వివరాలు 

రెండే ప్రత్యామ్నాయాలు!

ఐబీఎం నిర్ణయంతో ప్రభావితమయ్యే ఉద్యోగుల ముందు ప్రధానంగా రెండు మార్గాలు కనిపిస్తున్నాయి.

అమెరికాను విడిచి ఇతర దేశాల్లో ఉన్న ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావడం లేదా ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు.

ముఖ్యంగా ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో పనిచేస్తున్న పలువురు టెక్కీలు తమ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చు.

కన్సల్టింగ్ విభాగానికి అవసరమైన సాంకేతిక నిపుణులు అమెరికాలోనే అందుబాటులో ఉండటం, సంస్థ కార్యకలాపాలు, వ్యాపార అవసరాల్లో మార్పులు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం వెల్లడించింది.

వివరాలు 

బ్లూమ్‌బెర్గ్ ప్రత్యేక కథనం

ఐబీఎం నిర్ణయంపై ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

సంస్థ ప్రతినిధి వెల్లడించిన వివరాలను తన కథనంలో ప్రస్తావించింది.

కన్సల్టింగ్ విభాగంలో కొత్త హెచ్‌1బీ వీసా దరఖాస్తులతో పాటు, గ్రీన్‌కార్డ్ కోసం అవసరమైన పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను కూడా నిలిపివేసినట్లు ఐబీఎం ప్రతినిధి స్పష్టం చేశారని తెలిపింది.

గత కొంతకాలంగా వీసా కార్యక్రమాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నామని ఆయన పేర్కొన్నట్లు వివరించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏడాదికి 1,100 వీసా దరఖాస్తులు

అమెరికా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐబీఎం సుమారు 1,100 హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసింది.

అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి ఇతర అమెరికా టెక్ దిగ్గజాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే.

అయినప్పటికీ సంస్థ వీసా స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేయాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామం ముఖ్యంగా ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు, భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం చూపనుంది.

ADVERTISEMENT

వివరాలు 

కఠినతరమైన అమెరికా వీసా నిబంధనలు

అమెరికాలో హెచ్‌1బీ వీసా విధానం, పర్మ్ ప్రక్రియపై తనిఖీలు కఠినతరం అవుతున్న సమయంలో ఐబీఎం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉద్యోగ అవకాశాల్లో అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై నిఘా పెంచింది. భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి ఉద్యోగులను తీసుకుంటున్న కంపెనీల నియామక ప్రక్రియలను పరిశీలిస్తోంది.

పర్మ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కొన్ని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు విచారణలను కూడా ఎదుర్కొంటున్నాయి.

వివరాలు 

'గ్రీన్‌కార్డ్' కల మరింత దూరం!

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ లభించాలంటే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ కీలకమైన ప్రక్రియ.

తమ సంస్థలో పనిచేయడానికి తగిన అర్హతలున్న అమెరికన్ అభ్యర్థులు అందుబాటులో లేరని, అందుకే ఇతర దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవాల్సి వస్తోందని సంబంధిత కంపెనీలు కార్మిక శాఖకు నిరూపించాలి.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రీన్‌కార్డ్ దరఖాస్తులో తదుపరి దశలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఐబీఎం ఈ ప్రక్రియను నిలిపివేయడంతో ఇప్పటికే హెచ్‌1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల గ్రీన్‌కార్డ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారనున్నాయి.

వివరాలు 

'గ్రీన్‌కార్డ్' కల మరింత దూరం!

గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ లేకపోతే అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందే ప్రక్రియ ముందుకు సాగడం కష్టమవుతుంది.

హెచ్‌1బీ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే కొనసాగాలనుకునే ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.

దీంతో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం లేదా కెనడా, ఐరోపా వంటి ప్రాంతాల్లో ఉన్న ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

ADVERTISEMENT