
ICICI Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు.. సేవింగ్స్ అకౌంట్లో రూ.50 వేలు ఉండాల్సిందే..
ఈ వార్తాకథనం ఏంటి
పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే విధించే అపరాధ రుసుమును ఇటీవలి కాలంలో అనేక బ్యాంకులు రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ మాత్రం విరుద్ధంగా వ్యవహరించి కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. సేవింగ్ అకౌంట్లలో తప్పనిసరిగా ఉంచాల్సిన కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మొత్తాన్ని గణనీయంగా పెంచినట్లు ప్రకటించింది. ఈ పెంపు ప్రభావం మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ శాఖల్లో ఖాతాలు కలిగిన వారందరిపైనా పడనుందని బ్యాంక్ వెల్లడించింది. కొత్త నిబంధనలు 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
వివరాలు
కొత్త నిబంధనల ప్రకారం..
మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఐసీఐసీఐ సేవింగ్ అకౌంట్ ఉన్న కస్టమర్లు ఇకపై కనీసం ₹50,000 సగటు నిల్వను ఉంచాలి. గతంలో ఈ పరిమితి ₹10,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు దీన్ని ఐదు రెట్లు పెంచారు. సెమీ అర్బన్ బ్రాంచ్ కస్టమర్ల కోసం ఈ కనీస సగటు నిల్వ పరిమితి ₹5,000 నుంచి ₹25,000కు పెరిగింది. గ్రామీణ శాఖల ఖాతాదారుల విషయంలో ₹2,500 నుంచి ₹10,000కు పెంచారు. ఖాతాదారులు తమ ఖాతాల్లోని నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని, కొత్త నిబంధన ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేని పక్షంలో తగిన ఛార్జీలు వసూలు చేయబడతాయని బ్యాంక్ హెచ్చరించింది.
వివరాలు
కనీస సగటు నిల్వ నిబంధనల్లో ఇది అత్యధిక పరిమితి
ప్రస్తుతం దేశీయబ్యాంకులు అమలు చేస్తున్న కనీస సగటు నిల్వ నిబంధనల్లో ఇది అత్యధిక పరిమితి కావడం గమనార్హం. ఉదాహరణకు,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మెట్రో/అర్బన్ నగరాల్లో గరిష్ఠంగా ₹10,000మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన అమలులో ఉంది. యాక్సిస్ బ్యాంక్‌లో ఈ పరిమితి ₹12,000గాఉంది.మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే కస్టమర్ల నుంచి నిర్దిష్ట రుసుములు వసూలు చేయడం బ్యాంకింగ్ రంగంలో సాధారణమే. అయితే,ఈఛార్జీల నుంచి మినహాయింపులు ఇస్తూ కొంతమంది బ్యాంకులు ఖాతాదారులకు ఊరట కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో అతి పెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ ఇప్పటికే 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ లేని పక్షంలో అపరాధ రుసుము వసూలు చేసే నిబంధనను రద్దు చేసింది. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్,బ్యాంక్ ఆఫ్ బరోడా,ఇండియన్ బ్యాంక్,కెనరా బ్యాంక్‌లు కూడా ఈ రుసుమును పూర్తిగా తొలగించాయి.