Bharat Rice: సబ్సిడీ ధరలకు బియ్యం, గోధుమ పిండి కొనడానికి ఐడీ కార్డ్ అవసరమా?
భారత ప్రభుత్వం దేశంలోని నిరుపేదలకు తక్కువ ధరలో ఆహార పదార్థాలను అందించడానికి అనేక పథకాలను ప్రారంభించింది. వీటిలో భాగంగా "భారత్ అట్టా" (గోధుమ పిండి), "భారత్ రైస్" పేరిట ప్రధాన ఆహార పదార్థాలను తక్కువ ధరలతో అందించడానికి చర్యలు తీసుకుంది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో ఆహార పదార్థాలను అందిస్తోంది, దీంతో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇది సహాయపడుతోంది. అయితే, ఈ పథకంపై ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని వ్యక్తులు ఐడీ ప్రూఫ్ చూపిస్తేనే ఈ ఆహార పదార్థాలు అందజేస్తారని భావిస్తున్నారు.
ధరలు కొద్దిగా సర్దుబాటు
ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయం అందించేందుకు సబ్సిడీ ధరలపై బియ్యం, గోధుమ పిండి అందించాలని నిర్ణయించింది. "భారత్ అట్టా", "భారత్ రైస్" అనే బ్రాండ్ పేర్లతో ఈ సరకులు NCCF(నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్), NAFED (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా పంపిణీ చేయబడతాయి. కొన్ని ప్రాంతాలలో పప్పులు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రారంభంలో, "భారత్ అట్టా" కిలో రూ.27.50కి,"భారత్ రైస్" కిలో రూ.29కి అందజేశారు. ఈ సంవత్సరం ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించి,ధరలను కొద్దిగా సర్దుబాటు చేశారు. ప్రస్తుతం"భారత్ అట్టా"కిలో రూ.30కి,"భారత్ రైస్"కిలో రూ.34కి అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్పత్తులు NCCF, NAFED, ప్రభుత్వ దుకాణాలు నిర్వహించే మొబైల్ వ్యాన్ల ద్వారా అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి.
ఐడీ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు
భారత్ అట్టా,భారత్ రైస్ కొనడానికి ఐడీ కార్డు అవసరమా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ, ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఐడీ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎలాంటి ఐడీ కార్డులు లేకుండా కూడా ఈ ఆహార పదార్థాలు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఈ ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, జియో మార్ట్ (JioMart) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో "భారత్ అట్టా" లిస్ట్ చేయబడింది. ఇంటి నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు. జియో మార్ట్ లింక్: https://www.jiomart.com/p/groceries/baharat-atta-10kg-pp/607008444
బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం
గత బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ "భారత్ రైస్" గురించి ప్రస్తావించారు. బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు"భారత్ రైస్" బ్రాండ్ కింద సబ్సిడీ బియ్యం విక్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో,బియ్యం ధరల నియంత్రణ కోసం బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.