IIFCL: రూ.14,500 కోట్ల రుణ సమీకరణకు ఐఐఎఫ్‌సీఎల్ ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత వేగం ఇవ్వడానికి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్(IIFCL)భారీ నిధుల సమీకరణకు సిద్ధమవుతోంది. పలు అంతర్జాతీయ సంస్థలు, విదేశీ పెట్టుబడిదారుల నుంచి సుమారు 1.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.14,500 కోట్లు) రుణంగా సమీకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నిధులను దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాల రూపంలో అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. సంస్థ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ రిషి మాట్లాడుతూ, మౌలిక రంగంలో పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చేందుకు దీర్ఘకాలిక నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. దేశీయంగా సమీకరించిన నిధులతో పాటు ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ(KfW), జేఐసీఏ(JICA), ఈఐబీ(EIB), వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరిస్తున్నట్లు చెప్పారు.
Details
మరో 600 మిలియన్ డాలర్ల రుణాన్ని సమీకరించే అవకాశం
అలాగే గతేడాది డిసెంబర్ నాటికి జపాన్‌కు చెందిన ఎస్‌ఎంబీసీ (SMBC) నుంచి 26 బిలియన్ జపాన్ యెన్‌లు (సుమారు రూ.1,520 కోట్లు) రుణంగా పొందినట్లు వెల్లడించారు. ఈ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుతో పొందగలిగినట్లు, భారత ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ రుణ సంస్థలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే కాకుండా రాబోయే కాలంలో వివిధ ఆర్థిక సంస్థల ద్వారా మరో 600 మిలియన్ డాలర్ల రుణాన్ని సమీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే దీర్ఘకాలిక వాణిజ్య రుణం కింద 1 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించేందుకు అవసరమైన అనుమతులు పొందే ప్రక్రియలో ఉన్నామని రోహిత్ రిషి వివరించారు.