Loading...
Stock Market Today: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. 800 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. 800 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌!

Stock Market Today: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. 800 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో భారత సూచీలు పుంజుకున్నాయి. అయితే, భారీగా కొనసాగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్ల దూకుడుకు అడ్డంకిగా మారుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఉదయం 9.43 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 800 పాయింట్లు ఎగబాకి 74,917 వద్ద కదలాడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 211 పాయింట్లు పుంజుకుని 23,100 వద్ద ట్రేడయింది. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్‌, ట్రెంట్‌, భారత్ ఎలక్ట్రానిక్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

వివరాలు

మార్కెట్ల లాభాలకు కారణాలివే!

ఇక డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ట్రేడింగ్ ప్రారంభంలో 18 పైసలు బలపడి రూ.94.73కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులతో పాటు దేశీయంగా పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీల పెరుగుదలకు దోహదపడింది.

ముఖ్యంగా ట్రేడింగ్ ప్రారంభంలో ఐటీ, చమురు, గ్యాస్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ప్రముఖ కంపెనీలు ప్రకటించిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా మదుపర్లకు ఆశాజనకంగా కనిపించాయి.

దీంతో కార్పొరేట్ కంపెనీల పనితీరు మెరుగ్గా ఉండవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దేశీయ మార్కెట్లో ద్రవ్యలభ్యత కూడా సూచీలు లాభాల్లో కొనసాగడానికి మరో కారణమని చెబుతున్నారు.

వివరాలు

అడ్డంకిగా మారిన ముడి చమురు ధరలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఘర్షణల పరిష్కారానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరుగుతాయనే అంచనాలు ఉన్నప్పటికీ, ముడి చమురు ధరలు మాత్రం అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి.

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు ఎక్కువగా ఉండటం మార్కెట్లపై ఒత్తిడి పెంచే అంశంగా మారింది.

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు ఉన్నప్పటికీ చమురు ధరల పెరుగుదల సూచీల మరింత దూకుడును పరిమితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరవచ్చని చేసిన ప్రకటనలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి.

ADVERTISEMENT