Stock market: ట్రంప్ విధానాల ప్రభావం.. భారీ నష్టాల్లో టాప్ 100 కంపెనీల షేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితులను గమనిస్తే, గ్రేట్ ఇండియన్ సేల్ కొనసాగుతోందనే చెప్పాలి. టాప్ కంపెనీల షేర్లు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి.
ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావంతో, టాప్ కంపెనీల షేర్లు గత ఆరు నెలల్లో సగటున 25 శాతం పడిపోయాయి. కొన్ని షేర్లు అయితే 55 శాతం వరకు నష్టపోయాయి.
అదానీ గ్రూప్ షేర్లపై తీవ్ర ప్రభావం
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈ పతనంలో ముందంజలో ఉన్నాయి. గౌతమ్ అదానీపై గతేడాది అమెరికాలో లంచం కేసు నమోదు కావడం, ఆపై దర్యాప్తు ప్రారంభమవడంతో షేర్లు భారీగా పడిపోయాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ 55శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 25శాతం, అదానీ పోర్ట్స్ 20శాతం పతనమయ్యాయి.
Details
భారీగా పడిపోయిన షేర్లు
తాజాగా, ట్రంప్ ప్రభుత్వం ఈ కేసులపై దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయడంతో, ఈ గ్రూప్ కంపెనీల షేర్లు కోలుకోవడం ప్రారంభించాయి.
ఇతర టాప్ కంపెనీల షేర్లు కూడా భారీగా పడిపోయాయి.
కిర్లోస్కర్ ఆయిల్, తాన్లా ప్లాట్‌ఫామ్స్ 50శాతం, నాట్కో ఫార్మా 47శాతం, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 45శాతం, స్టార్ హెల్త్ 42శాతం, ఎన్‌సీసీ, ఆయిల్ ఇండియా 41శాతం, సన్ ఫార్మా 39శాతం, పీవీఆర్ 38 శాతం డౌన్ అయ్యాయి.
Details
కార్ల కంపెనీలకు భారీ నష్టాలు
అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలలో భాగంగా, టెస్లా కార్లపై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి మోదీతో చర్చలు జరిపింది. దీంతో వెహికల్ తయారీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి.
టాటా మోటార్స్ 38శాతం, హీరో మోటోకార్ప్ 36శాతం, బజాజ్ ఆటో 30శాతం, భారత్ ఫోర్జ్ 30శాతం, సంవర్ధన మదర్సన్ 32శాతం, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 31శాతం, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 26శాతం పతనమయ్యాయి.
Details
ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల సలహా
మార్కెట్ కరెక్షన్ సమయంలో లార్జ్ క్యాప్ షేర్లు సాధారణంగా కొంత స్థిరంగా ఉంటాయని, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లతో పోలిస్తే ఇవి తక్కువ నష్టపోతాయని ఎనలిస్టులు సూచిస్తున్నారు.
మార్కెట్ పడిన సమయంలో లార్జ్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు రక్షణగా ఉంటాయని VSRK క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు.
రిస్క్ తీసుకోవాలనుకునే వారు క్వాలిటీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చని సూచించారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించేలా ఉన్నా తక్కువ విలువకు లభించే క్వాలిటీ షేర్లను ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం ఉత్తమ మార్గంగా ఎనలిస్టులు సూచిస్తున్నారు.