Page Loader
Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా?
బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా?

Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

బడ్జెట్ సమీపిస్తున్న కొద్దీ సామాన్యుల్లో, ముఖ్యంగా వేతన జీవుల్లో, అంచనాలు పెరుగుతున్నాయి. బడ్జెట్‌ 2025 పై గంపెడాశలతో ఉన్నవారు ఈసారి ఊరటనిచ్చే ప్రకటనలు వెలువడతాయని ఆశిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, కేంద్రం వినియోగాన్ని పెంచి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో వేతన జీవులకు తీపికబురు అందించే దిశగా పరిశీలన చేస్తోందట. సీఎన్‌బీసీ-18 ఓ కథనం ప్రకారం, ఇందుకోసం కొన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

వివరాలు 

వృద్ధి కోసం వినియోగం పెంపు 

దేశ ఆర్థికవృద్ధి వేగవంతం చేయాలంటే వస్తు, సేవల డిమాండ్‌ పెంచడం అవసరం. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్నులో మినహాయింపులు కల్పించడం ద్వారా వారి కొనుగోలు శక్తి పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీని వల్ల ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. వినియోగాన్ని పెంపొందించడం ద్వారా వృద్ధికి బాటలు వేయాలని, బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపులు పెంచాలని ఐక్రా వంటి సంస్థలు సైతం సూచించాయి.

వివరాలు 

జీడీపీ వృద్ధి అంచనాలు 

2023-24: భారత ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధి నమోదు చేసింది. 2024-25: 6.4% వృద్ధి మాత్రమే సాధ్యమవుతుందని కేంద్ర గణాంక కార్యాలయం అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ కూడా 6.6% వృద్ధి మాత్రమే సాధ్యమని పేర్కొంది. వినియోగం తగ్గుదల దీనికి ప్రధాన కారణం. వేతన జీవుల కోసం ముందస్తు ఆలోచనలు: 1. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు: కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం ₹75,000 ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను మరింత పెంచే ఆలోచన ఉంది.

వివరాలు 

2. ట్యాక్స్ శ్లాబుల సవరణ: 

కొత్త పన్ను విధానంలో రూ.12-15 లక్షల ఆదాయానికి ప్రస్తుతం 20% పన్ను ఉంది. ఈ శ్లాబును ₹18-20 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 30% పన్ను వర్తిస్తోంది. దీన్ని రూ.18-20 లక్షల దాకా పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పులన్నీ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. బడ్జెట్‌లో ఏ నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.