Income Tax: పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకే గడువు.. రిటర్నులు దాఖలు చేయకపోతే చట్టపరమైన చర్యలు
2023-24 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించిన వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా? ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు జులై 31న ముగిసింది. అయితే ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారికి ఆదాయపు పన్ను చట్టం ద్వారా మరో అవకాశం లభిస్తోంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ఆలస్యంగా రిటర్నులు సమర్పించవచ్చు. ఈ సమయంలో దాఖలు చేసిన రిటర్నులను బిలేటెడ్ రిటర్న్స్ అంటారు. అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనల ప్రకారం, కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ గడువు కూడా దాటితే పరిస్థితి ఏమిటి? జైలుశిక్ష కూడా పడవచ్చా? అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యేక సందర్భాల్లో జైలుశిక్ష
బిలేటెడ్ రిటర్నులు దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపుగా ఉంటే రూ. 1000 జరిమానా చెల్లించాలి. ఆదాయం రూ. 5 లక్షలకు మించినట్లయితే రూ. 5000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కానీ డిసెంబర్ 31 తర్వాత కూడా రిటర్నులు సమర్పించకపోతే, పన్ను చట్టం ప్రకారం జరిమానా, వడ్డీ, ఇతర శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, జైలుశిక్షకు కూడా అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఆలస్యం కారణంగా వ్యాపార నష్టాలు లేదా మూల ధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.
కొత్త పన్ను విధానంలోనే రిటర్నులు
అలాగే, బిలేటెడ్ రిటర్నులు దాఖలు చేసే వారు కచ్చితంగా కొత్త పన్ను విధానంలోనే రిటర్నులు సమర్పించాలి. పాత పన్ను విధానం ప్రకారం దాఖలు చేయడం సాధ్యం కాదు. దీంతో పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. డిసెంబర్ 31లోగా రిటర్నులు ఫైల్ చేయకపోతే, ఆదాయపు పన్ను శాఖకు ప్రత్యేక అభ్యర్థన చేసుకోవాల్సి ఉంటుంది. జాప్యానికి సరైన కారణాలు అందజేస్తేనే, ఆమోదం పొందిన తర్వాత జరిమానా,వడ్డీతో రిటర్నులు ఫైల్ చేయడానికి అనుమతి లభిస్తుంది. అయితే, ఇది క్లిష్టమైన ప్రక్రియ. అందువల్ల, ఆలస్యం చేయకుండా త్వరగా రిటర్నులు ఫైల్ చేయడం ఉత్తమం.