Page Loader
Income Tax Refund: ఆదాయపు పన్నుచెల్లింపుదారులకు గుడ్ న్యూస్..ఇకపై 17రోజుల్లోనే ITR రిఫండ్ క్రెడిట్ అవుతుంది..ఇదిగో పూర్తి వివరాలు 
ఆదాయపు పన్నుచెల్లింపుదారులకు గుడ్ న్యూస్..ఇకపై 17రోజుల్లోనే ITR రిఫండ్ క్రెడిట్ అవుతుంది

Income Tax Refund: ఆదాయపు పన్నుచెల్లింపుదారులకు గుడ్ న్యూస్..ఇకపై 17రోజుల్లోనే ITR రిఫండ్ క్రెడిట్ అవుతుంది..ఇదిగో పూర్తి వివరాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త! ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసారా? ఐటీ రిటర్న్‌ల దాఖలు తుది తేదీ దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 15, 2025 వరకు ఎలాంటి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇకపై ఆదాయపు పన్ను రీఫండ్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే గతానికి భిన్నంగా ఇప్పుడు ఐటీఆర్ రీఫండ్ వేగంగా అందేలా చర్యలు తీసుకున్నారు. గత 11 ఏళ్లలో పన్ను రీఫండ్‌ జారీ ప్రక్రియ మరింత వేగంగా మారినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేవలం రీఫండ్ మొత్తాలు మాత్రమే కాకుండా ప్రాసెసింగ్‌కు తీసుకునే సమయం కూడా గణనీయంగా తగ్గింది.

వివరాలు 

93 రోజుల నుంచి 17 రోజులకు తగ్గిన రీఫండ్ జారీ కాలం: 

2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.83,008 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్‌ జారీ చేశారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి చేరేసరికి రూ.4.77 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గత 11 ఏళ్ల కాలంలో పన్ను రీఫండ్‌ల విలువ 474 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో స్థూల పన్ను వసూళ్లలో 274శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. అంతేకాదు, పన్ను రీఫండ్ జారీకి పట్టే సగటు సమయం కూడా 81 శాతం తగ్గింది. గతంలో రీఫండ్ పొందేందుకు సగటున 93 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమయం కేవలం 17 రోజులకు పరిమితమైంది. ఇకపై రీఫండ్ కోసం పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మారిందని అధికారులు తెలిపారు.

వివరాలు 

పన్ను రిటర్నుల సంఖ్యలో 133 శాతం పెరుగుదల: 

2013 సంవత్సరంలో 3.8 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయగా, 2024 నాటికి ఈ సంఖ్య 8.89 కోట్లకు పెరిగింది. మొత్తం రిటర్నుల సంఖ్య గతంతో పోలిస్తే 133 శాతం పెరిగినట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.22 లక్షల కోట్ల నుంచి రూ.27.03 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే వృద్ధి శాతం 274గా నమోదైంది. పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

వివరాలు 

పన్ను వ్యవస్థ బలోపేతం - డిజిటలైజేషన్, వేగవంతమైన ప్రాసెసింగ్ వల్ల ప్రయోజనాలు: 

డిజిటలైజేషన్‌ను వేగంగా అమలు చేయడం,స్పీడ్ ప్రాసెసింగ్,ఆధునిక టెక్నాలజీ వినియోగం వల్ల పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ త్వరగా అందుతోందని పేర్కొన్నారు. ఎండ్ టు ఎండ్ ఆన్‌లైన్ ఫైలింగ్, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ విధానాల వల్ల రీఫండ్ జారీకి పట్టే సమయం గణనీయంగా తగ్గిందని తెలిపారు. ముందుగానే నింపిన రిటర్న్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఆటోమేషన్ అమలు చేయడం, రియల్ టైమ్ TDS సర్దుబాట్లు, ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార విధానాల వల్ల జాప్యాలు తగ్గినట్లు వివరించారు. ఈ చర్యలన్నీ కలిసి పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని మెరుగుపరిచినట్లు వివరించారు. గతంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 11.5 శాతం ఉన్న రీఫండ్ నిష్పత్తి 2024-25 నాటికి 17.6 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేశారు.