NFAP: అమెరికా యూనికార్న్‌లలో భారతీయుల హవా.. 96 స్టార్టప్‌ల వెనుక మనోళ్లే..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తరచూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. వలసదారులు అమెరికన్ల అవకాశాలను దెబ్బతీస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే తాజా గణాంకాలు మాత్రం భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. అమెరికాలో విలువైన స్టార్టప్‌లుగా ఎదిగిన యూనికార్న్ కంపెనీలలో గణనీయమైన సంఖ్యలో వలసదారుల భాగస్వామ్యం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఈ జాబితాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలే అగ్రస్థానంలో నిలవడం విశేషం.
వివరాలు
455 యూనికార్న్‌లలో వలసదారుల భాగస్వామ్యం
నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) 'ఇమిగ్రెంట్స్ అండ్ యూఎస్ బిలియన్ డాలర్ కంపెనీస్' పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో ప్రస్తుతం 775 ప్రైవేట్ యూనికార్న్ స్టార్టప్‌లు ఉండగా, వాటిలో 455 కంపెనీలకు వలసదారులు వ్యవస్థాపకులు లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇది మొత్తం యూనికార్న్‌లలో 59 శాతానికి సమానం. ఈ కంపెనీల సమిష్టి మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు మించి ఉందని అధ్యయనం వెల్లడించింది. దీంతో అమెరికా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో వలసదారుల పాత్ర ఎంత కీలకమో స్పష్టమవుతోంది.
వివరాలు
భారతీయులే అగ్రస్థానంలో..
వలసదారుల భాగస్వామ్యంతో ఏర్పడిన యూనికార్న్‌లలో అత్యధికంగా 96 కంపెనీలకు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు వ్యవస్థాపకులుగా లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. దీంతో ఈ జాబితాలో భారత్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.ఈ జాబితాలో ప్రముఖ ఏఐ సంస్థ పర్‌ప్లెక్సిటీ కూడా ఉంది. భారతీయ మూలాలున్న అరవింద్ శ్రీనివాస్ ఈ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ అమెరికా యూనికార్న్‌ల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఏ దేశాలు? భారత్ తర్వాత 60 యూనికార్న్‌లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో నిలిచింది. అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్ (47),చైనా (41),కెనడా (30),రష్యా (23),ఫ్రాన్స్ (21), జర్మనీ (18), ఉక్రెయిన్ (16), ఆస్ట్రేలియా (14) స్థానాల్లో ఉన్నాయి.
వివరాలు
ఉద్యోగాల సృష్టిలోనూ కీలక పాత్ర
వలసదారుల వ్యవస్థాపక భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ బిలియన్ డాలర్ల స్టార్టప్‌లు సగటున 833 ఉద్యోగాలను సృష్టించినట్లు అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు, అమెరికాలోని యూనికార్న్‌లలో దాదాపు 80 శాతం కంపెనీల్లో వలసదారులు వ్యవస్థాపక సభ్యులుగా లేదా సీఈఓలు, ఇతర కీలక నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతున్నారని నివేదిక పేర్కొంది.
వివరాలు
పలువురు భారతీయులు బహుళ యూనికార్న్‌ల వ్యవస్థాపకులు
కనీసం 15 మంది వలసదారులు రెండు లేదా అంతకంటే ఎక్కువ యూనికార్న్ కంపెనీల స్థాపనలో భాగస్వాములయ్యారు. వీరిలో భారత సంతతికి చెందిన మోహిత్ అరోన్, జ్యోతి బన్సాల్, అషుతోష్ గార్గ్, అరవింద్ జైన్, సచిన్ నాయర్, అజీత్ సింగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే దక్షిణాఫ్రికా మూలాలున్న ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ నాలుగు యూనికార్న్ కంపెనీల స్థాపనలో భాగస్వామిగా ఉన్నారు. స్పేస్‌ఎక్స్, ఓపెన్‌ఏఐ, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ వంటి సంస్థల్లో ఆయన ఫౌండర్ లేదా కో-ఫౌండర్‌గా వ్యవహరించారు.
వివరాలు
అమెరికా విజయాల్లో వలసదారుల ముద్ర
తాజా అధ్యయనం ప్రకారం, అమెరికాలో అత్యంత విలువైన స్టార్టప్‌ల ఎదుగుదలలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్తలు సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలకు, ఉద్యోగాల సృష్టికి, పెట్టుబడుల ఆకర్షణకు విశేషంగా దోహదపడుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.