LOADING...
India-Canada: భారత్-కెనడా మధ్య చారిత్రాత్మక యురేనియం ఒప్పందం
భారత్-కెనడా మధ్య చారిత్రాత్మక యురేనియం ఒప్పందం

India-Canada: భారత్-కెనడా మధ్య చారిత్రాత్మక యురేనియం ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-కెనడా మధ్య కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. అలాగే 1.9 బిలియన్ డాలర్ల విలువైన దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఒప్పందం కూడా సంతకం అయ్యింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన తొలి అధికారిక భారత్ పర్యటనలో భాగంగా ఈ కీలక ఒప్పందాలు జరిగాయి. న్యూఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రెండు దేశాల నేతలు ఈ ఒప్పందాలను ఖరారు చేశారు. దీంతో అణుశక్తి, పునరుత్పాదక ఇంధన రంగాలు, ఆధునిక సాంకేతికత, అంతరిక్ష సహకారం వంటి రంగాల్లో భారత్-కెనడా సంబంధాలు మరింత బలపడనున్నాయి. దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఒప్పందాన్ని "చారిత్రాత్మక ఒప్పందం"గా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వివరాలు 

భారత్ 2047 నాటికి అణుశక్తి ఉత్పత్తిని 100 గిగావాట్లకు పెంచే లక్ష్యం

కెనడాకు చెందిన యురేనియం ఉత్పత్తి సంస్థ క్యామెకో కార్ప్ 2027 నుంచి 2035 వరకు భారత్‌కు సుమారు 22 మిలియన్ పౌండ్ల యురేనియం సరఫరా చేయనుంది. భారత్ 2047 నాటికి అణుశక్తి ఉత్పత్తిని 100 గిగావాట్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ, దేశీయ యురేనియం నిల్వలు సరిపోకపోవడంతో దిగుమతులు కీలకంగా మారాయి. ఇదే సమయంలో కీలక ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు రెండు దేశాలు ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, శుభ్ర ఇంధన సాంకేతికతలకు అవసరమైన వనరుల భద్రతే లక్ష్యంగా ఈ ఒప్పందం ఉండనుంది. అలాగే ఎల్‌ఎన్‌జీ, సోలార్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ రంగాల్లో సహకారం పెంచాలని నిర్ణయించారు.

వివరాలు 

కెనడాలో కార్యకలాపాలను విస్తరించనున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్

ఈ ఏడాది భారత్-కెనడా పునరుత్పాదక ఇంధన సదస్సు నిర్వహించనున్నారు. అంతేకాక కెనడా అంతర్జాతీయ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయెల్ అలయన్స్‌లలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. అణుశక్తి రంగంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, ఆధునిక రియాక్టర్ టెక్నాలజీలపై కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇంధన రంగంతో పాటు కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, సూపర్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లలో కూడా భాగస్వామ్యం పెంచాలని అంగీకరించాయి. అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు, పరిశ్రమలను పరస్పరం కలిపి సంయుక్తంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. భారత ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కెనడాలో తమ కార్యకలాపాలను విస్తరించి 2030 నాటికి ఉద్యోగులను 75 శాతం వరకు పెంచే ప్రణాళిక ప్రకటించింది.

Advertisement

వివరాలు 

భారత్-కెనడా అణుశక్తి భాగస్వామ్యం

రెండు దేశాల మధ్య 2023లో నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత ఇప్పుడు వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా ఈ ఒప్పందాలు కీలకంగా మారాయి. ఈ ఏడాదిలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని పూర్తి చేసి 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 1950ల నుంచే ప్రారంభమైన అణుశక్తి సహకారం, 1974లో భారత్ అణు పరీక్షల తర్వాత నిలిచిపోయినా, 2008లో అమెరికాతో కుదిరిన సివిల్ న్యూక్లియర్ ఒప్పందం తర్వాత మళ్లీ పునఃప్రారంభమైంది. 2010లో ద్వైపాక్షిక అణు ఒప్పందం, 2015లో యురేనియం సరఫరా ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా ఒప్పందంతో భారత్-కెనడా అణుశక్తి భాగస్వామ్యం మరింత బలపడనుంది.

Advertisement