India Economic Powerhouse: 2027 నాటికి 7.2% వృద్ధి? మార్కెట్లలో ఆశావహ సంకేతాలు
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతి సాధించే దిశగా సాగుతుందని ప్రముఖ ఆర్థిక సలహా సంస్థ EY ఎకానమీ వాచ్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం నుండి 7.2 శాతం మధ్య నమోదయ్యే అవకాశముందని పేర్కొనడంతో మార్కెట్ వర్గాల్లో ఆశావాదం పెరిగింది. ఈ స్థాయి వృద్ధి ఉపాధి అవకాశాలను విస్తరించడమే కాకుండా, మార్కెట్లో ద్రవ్యత పరిస్థితులను మెరుగుపరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన విధాన పరమైన చర్యలు,మధ్యకాలిక ఆర్థిక అవకాశాలు ఈ సానుకూల అంచనాలకు బలమైన పునాదిగా నిలిచాయని నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థాయిని బలపరచడంలో కీలక పాత్ర
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల విస్తరణ వల్ల భారతదేశం గ్లోబల్ ట్రేడ్ నెట్‌వర్క్‌లో తన స్థాయిని మరింత బలపర్చుకుందని EY ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు. ముఖ్య ఆర్థిక సమూహాలతో పెరుగుతున్న వాణిజ్య భాగస్వామ్యం దేశ వృద్ధి అవకాశాలను మరింత విస్తరింపజేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, దేశంలో కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ దిశను సానుకూలంగా మలుస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ మార్పులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థాయిని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణ ప్రజల దృష్టికోణంలో చూస్తే, వ్యక్తిగత ఆదాయపు పన్ను, జీఎస్టీ వ్యవస్థల్లో చేసిన సవరణలు కుటుంబాల వినియోగయోగ్య ఆదాయాన్ని పెంచడాన్ని లక్ష్యంగా చేసుకున్నవే.
వివరాలు
పన్ను రాయితీల ప్రభావంతో ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడి పెరిగే అవకాశం
ప్రజల వద్ద ఖర్చు చేయగలిగే డబ్బు పెరిగితే వినియోగం పెరుగుతుంది; దాని ద్వారా ఆర్థిక చలనం మరింత వేగవంతమవుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అయితే, పన్ను రాయితీల ప్రభావంతో ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడి పెరిగే అవకాశముందని నివేదిక హెచ్చరించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పన్ను వసూళ్ల లక్ష్యాలను పూర్తిగా సాధించడం సవాలుగా మారవచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పన్ను-జీడీపీ నిష్పత్తి పెంపు అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక విధానాలపై మార్కెట్ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక లోటు లక్ష్యాన్ని సాధించే సామర్థ్యం ఉందని వారు భావిస్తున్నారు.