El Niño: ఎల్‌నినో ప్రభావంతో ఆహార ధరలు పెరిగే ముప్పు.. ఎస్ అండ్ పీ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాభావం ఏర్పడి,భారత్‌తో పాటు వియత్నాం, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్ వంటి ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఆహార వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరించింది. ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ)అంచనాల ప్రకారం..2026 ఆగస్టు నుంచి అక్టోబరు మధ్య ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడే అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సాధారణ స్థాయిని మించి ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు అనావృష్టి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ దిగుబడులు దెబ్బతినడం,జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం,అడవుల్లో కార్చిచ్చుల ముప్పు పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ వివరించింది.
వివరాలు
భారత్‌లో పరిస్థితిని కొంతవరకు సమర్థంగా ఎదుర్కొనే అవకాశం
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగంపై అధికంగా ఆధారపడే దేశాలు, అలాగే ప్రజలు తమ ఆదాయంలో పెద్ద మొత్తాన్ని ఆహార ధాన్యాల కొనుగోలుకు వెచ్చించే ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది.
అయితే భారత్‌లో పరిస్థితిని కొంతవరకు సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది.
2026 జులై నాటికి దేశంలో సమృద్ధిగా ఉన్న ఆహార ధాన్యాల నిల్వలు ధరల పెరుగుదల నుంచి తక్షణ ఉపశమనం కల్పించగలవని పేర్కొంది.
పంట నష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో రైతులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతోందని తెలిపింది.
వివరాలు
భారత్‌లో పరిస్థితిని కొంతవరకు సమర్థంగా ఎదుర్కొనే అవకాశం
గతంతో పోలిస్తే దేశంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని ఎస్ అండ్ పీ వివరించింది.
తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లడం, నీటిపారుదల సదుపాయాల అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్వహణలో పెట్టుబడులు పెరగడం ఇందుకు కారణాలని పేర్కొంది.
నైరుతి రుతుపవనాల్లో అసమానతలు, ఎల్‌నినో పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌తో పాటు వ్యవసాయ రంగానికి కొంత ముప్పు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత వారం విడుదల చేసిన ద్రవ్య పరపతి సమీక్షలో పేర్కొంది.
అయితే ప్రభుత్వం ముందస్తుగా తీసుకుంటున్న చర్యలు, దేశంలో అందుబాటులో ఉన్న బియ్యం, గోధుమల నిల్వలతో ఆహారం, ఇంధన ధరలను నియంత్రణలో ఉంచే అవకాశం ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.
వివరాలు
ధరలు పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల సన్నాహాలు
ముడి సరుకుల ధరలు పెరగడం,భౌగోళిక రాజకీయ పరిణామాలతో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉత్పత్తుల తయారీ వ్యయం పెరుగుతోందని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దీనికి ఎల్‌నినో ప్రభావం కూడా తోడవడంతో కంపెనీల లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతోందని చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థలు సెప్టెంబరు త్రైమాసికంలోనూ తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
బ్రిటానియా, హిందుస్థాన్ యునిలీవర్ (హెచ్‌యూఎల్),గోద్రేజ్ వంటి సంస్థలు ఇప్పటికే జూన్ త్రైమాసికంలో కొన్ని ఉత్పత్తుల పరిమాణాన్ని తగ్గించగా.. మరికొన్ని ఉత్పత్తుల ధరలను పెంచాయి.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత త్రైమాసికంలోనూ ధరల పెంపు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలు
ధరలు పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల సన్నాహాలు
ఆయా సంస్థల ఉత్పత్తుల ధరలు దాదాపు 2 నుంచి 5 శాతం వరకు పెరగొచ్చని అంచనా.
సెప్టెంబరు త్రైమాసికంలో సుమారు 1.5 నుంచి 2 శాతం మేర ధరలను పెంచే అవకాశం ఉందని బ్రిటానియా ఎండీ, సీఈఓ రక్షిత్ హర్గెవ్ తెలిపారు.
మరోవైపు గోద్రేజ్ ఇప్పటికే సుమారు 5 శాతం మేర ధరలను పెంచింది.
ఉత్పత్తుల ధరలు వినియోగదారుల ఆదాయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని డాబర్ ఇండియా సీఈఓ మోహిత్ మల్హోత్రా తెలిపారు.
పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ధరల పెంపు తప్పనిసరి అవుతోందని ఆయన వెల్లడించారు.
హిందుస్థాన్ యునిలీవర్ కూడా ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచింది.
వివరాలు
ధరలు పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల సన్నాహాలు
సెప్టెంబరు త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 2 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్‌యూఎల్ సీఈఓ ప్రియా నాయర్ తెలిపారు.
పరిస్థితులకు అనుగుణంగా దశలవారీగా ఉత్పత్తుల ధరలను పెంచుతామని ఆమె వెల్లడించారు.
ఇదే బాటలో టాటా కన్జూమర్, నెస్లే సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా కంపెనీల సీఈఓలు సునీల్ డిసౌజా, మనీశ్ తివారీ తెలిపారు.
మొత్తంగా ముడి సరుకుల వ్యయాలు, అంతర్జాతీయ అనిశ్చితి, ఎల్‌నినో ప్రభావం కలిసి ఎఫ్‌ఎంసీజీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో రానున్న త్రైమాసికంలో వినియోగదారులపై ధరల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.