
Trump Tariffs on India:ట్రేడ్ డీల్ కు దగ్గరలో భారత్-అమెరికా.. 15-16 శాతానికి టారిఫ్‌లు తగ్గే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (US-India Trade Deal) త్వరలో ఖరారయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి ఈ ట్రేడ్ డీల్‌తో ట్రంప్ ఆధ్వర్యంలోని టారిఫ్‌లు (Trump Tariffs on India) భారీగా తగ్గే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతానికి 50 శాతంగా ఉన్న ఈ సుంకాలు,డీల్ అమలైన తర్వాత 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు. కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా ఈ ఒప్పందంపై ఆశాజనకంగా మాట్లాడారు.
వివరాలు
25 శాతం సుంకాలు 10-15 శాతానికి తగ్గే సూచనలు
"ట్రేడ్ డీల్‌పై నా వద్ద ఎలాంటి ఇన్‌సైడర్ సమాచారం లేదు. అయినప్పటికీ, రాబోయే రెండు నెలల్లో ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించి ఒప్పందానికి వస్తాయని భావిస్తున్నాం. డీల్ కుదిరిన వెంటనే టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉంది. ముందుగా అదనంగా విధించిన 25 శాతం సుంకాలను తీసివేయవచ్చు. ఆ తర్వాత 25 శాతం సుంకాలు 10-15 శాతానికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి" అని కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. నవంబరు 30 తర్వాత ఈ టారిఫ్‌లు ఉండకపోవచ్చని ఆయన ఇటీవల అంచనా వేసిన సంగతి తెలిసిందే.
వివరాలు
రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గొచ్చా..?
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇతర దేశాలతో పాటుగా భారత్ (India)పై ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రష్యా చమురు (Russian Oil)ను కొనుగోలు చేస్తోందన్న కారణంతో అదనంగా మరో 25శాతం టారిఫ్‌లు వేశారు. దీంతో మొత్తం 50 శాతం సుంకాలు ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు వస్తున్న వస్తువులపై అమలవుతున్నాయి. ఈ సుంకాల తగ్గింపు కోసం ఇరు దేశాల మధ్య దీర్ఘచర్చలు జరుగుతున్నాయి. అయితే వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన కొనుగోళ్లు ప్రధాన అంశాలుగా మారాయి.
వివరాలు
రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గొచ్చా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తమ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ తలుపులు తెరవాలని కోరుతున్నారు. ఇదే సమయంలో, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించడంపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇటీవల జరిగిన చర్చల్లో, ఇరు దేశాలు ఈ అంశాలపై పరస్పర అంగీకారానికి వచ్చాయని సమాచారం ఉంది. రష్యా చమురు దిగుమతులను క్రమంగా తగ్గించేందుకు భారత్ కూడా అంగీకరించవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు.
వివరాలు
మొక్కజొన్నపై 15 శాతం దిగుమతి సుంకం
ప్రస్తుతం భారత ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా 34 శాతం, అమెరికా వాటా దాదాపు 10 శాతంగా ఉంది. ఇదే సందర్భంలో, అమెరికా మొక్కజొన్న, సోయాబీన్‌ను భారత మార్కెట్లోకి అనుమతించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులను చైనా తగ్గించడంతో, భారత్‌కు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, మొక్కజొన్నపై 15 శాతం దిగుమతి సుంకం కొనసాగుతుందని తెలుస్తోంది.