Rupee: బంగారం దిగుమతి సుంకం పెంపు తర్వాత.. కరెంట్ అకౌంట్ లోటుపై కేంద్రం ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే వేగంగా పతనమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరెంట్ అకౌంట్ లోటు (CAD) పెరుగుదలను అదుపులోకి తీసుకురావడానికి మరిన్ని చర్యలు పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ భారత్ ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో భారత కరెంట్ అకౌంట్ లోటు 13.2 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికాకు ఎగుమతులు తగ్గడం,దిగుమతులు పెరగడం వల్ల వాణిజ్య లోటు మరింత విస్తరించింది. ముఖ్యంగా బంగారం, వెండి దిగుమతులు భారీగా పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.
వివరాలు
12 బిలియన్ డాలర్లను తాకిన వెండి దిగుమతులు
2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 24 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులు కూడా దాదాపు 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లను తాకాయి. దీంతో దేశ వాణిజ్య లోటు మూడు నెలల గరిష్ఠమైన 28.38 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.56 లక్షలు ఉండగా.. కిలో వెండి ధర రూ.2.53 లక్షల వద్ద కొనసాగుతోంది. విలువైన లోహాల దిగుమతులను తగ్గించేందుకు కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఐజీఎస్టీతో కలిపి మొత్తం సుంకం 18.45శాతానికి చేరింది.
వివరాలు
దిగుమతులను తగ్గించేందుకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు
అదేవిధంగా అడ్వాన్స్ అథరైజేషన్ పథకం కింద బంగారం దిగుమతులపై 100 కిలోల పరిమితి విధించింది. దిగుమతులను తగ్గించేందుకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు (QCOs) వంటి చర్యలూ తీసుకుంటోంది. ఇక రూపాయి పతనం ఆర్థిక వ్యవస్థకు పెద్ద హెచ్చరికగా మారింది. 2026లో ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 7 శాతం పడిపోయింది. ఫిబ్రవరి చివర్లో ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి 6 శాతానికి పైగా క్షీణించింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, డాలర్ బలపడటం వంటి కారణాలు రూపాయిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 88 శాతం కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతోంది.
వివరాలు
ప్రజలకు కీలక సూచనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే డాలర్ల అవసరం పెరుగుతుంది. దీంతో దిగుమతి బిల్లు పెరిగి రూపాయి మరింత బలహీనపడుతోంది. విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి పతనానికి కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అవసరం లేకుండా బంగారం కొనొద్దని, ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించాలని, వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ప్రతి పౌరుడు సహకరించాలని ఆయన కోరారు. భారత్-జీసీసీ ఉచిత వాణిజ్య ఒప్పందంపై తొలి విడత చర్చలు 2026 ద్వితీయార్థంలో ప్రారంభమవుతాయని పీయూష్ గోయెల్ తెలిపారు.