LOADING...
FPI investments: ఎఫ్‌పీఐలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం?
ఎఫ్‌పీఐలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం?

FPI investments: ఎఫ్‌పీఐలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ఈ పరిస్థితులు దేశ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు బలాన్నివ్వాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఓ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

క్యాపిటల్ గెయిన్స్ పన్ను రద్దుకు సన్నాహాలు

ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) భారీ ఊరట కల్పించేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడులపై ప్రస్తుతం అమలులో ఉన్న క్యాపిటల్ గెయిన్స్ పన్నును పూర్తిగా రద్దు చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడిదారులు దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 12 నెలలకు మించి అట్టిపెట్టుకునే బాండ్లు, లిస్టెడ్ షేర్లపై ఈ పన్ను వర్తిస్తోంది.

వివరాలు 

వడ్డీ ఆదాయంపై కూడా భారీ పన్ను

ఇక ప్రభుత్వ బాండ్ల ద్వారా పొందే వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం 20 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్ అమలులో ఉంది. గతంలో అమలులో ఉన్న 5 శాతం రాయితీ పన్ను రేటును కేంద్ర ప్రభుత్వం 2023లోనే రద్దు చేసింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులపై పన్ను భారం పెరిగిన పరిస్థితి ఏర్పడింది. రూ.2.5 లక్షల కోట్ల ఉపసంహరణ ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా నిధులను వెనక్కి తీసుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దాదాపు రూ.2.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు సమాచారం. దీంతో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని కొనసాగించేందుకు,ఎఫ్‌పీఐల అమ్మకాల ఒత్తిడిని తగ్గించేందుకు పన్ను రాయితీలు ఇవ్వాలని మార్కెట్ వర్గాల నుంచి డిమాండ్లు వ్యక్తమయ్యాయి.

Advertisement

వివరాలు 

మరిన్ని సంస్కరణలకు అవకాశం

భారత్ విదేశీ మారక నిల్వలను మరింత బలోపేతం చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకురావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించే దిశగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మూలధన లాభాలపై విధిస్తున్న పన్నుల విషయంలో పెట్టుబడిదారుల అభిప్రాయాలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆమె వ్యాఖ్యలు వెలువడిన కొద్ది రోజులకే కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement