Budget 2026 : దేశం చేతిలో అప్పులు మాత్రమే.. రూ.24 కోట్ల లోటుతో ప్రారంభమైన భారత తొలి బడ్జెట్
ఈ వార్తాకథనం ఏంటి
నేడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటూ గర్వంగా మాట్లాడుకుంటున్నాం. కానీ 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. దేశ విభజన వల్ల ఏర్పడిన గాయాలు, మత ఘర్షణలు, లక్షలాది శరణార్థుల సమస్యలు దేశాన్ని కుదిపేశాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖంశెట్టి దేశపు మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1947నవంబర్ 26న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ తొలి బడ్జెట్ కేవలం ఏడు నర నెలల కాలానికి మాత్రమే రూపొందించారు. అంటే ఆగస్టు 15నుంచి మార్చి 31వరకే ఈ బడ్జెట్ వర్తించింది. అప్పటి గణాంకాలను పరిశీలిస్తే నేటి తరానికి ఆశ్చర్యం కలగక మానదు.
Details
లోటు బడ్జెట్ తోనే ప్రారంభం
నేటి రోజుల్లో ఒక చిన్న ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుకంటే కూడా ఆనాటి దేశ మొత్తం ఆదాయం తక్కువగా ఉండడం విశేషం. స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌లో మొత్తం ఆదాయం కేవలం రూ.171.15కోట్లుగా అంచనా వేశారు. ఇక ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.197.29 కోట్లుగా నిర్ణయించారు. ఫలితంగా దేశం మొదటి నుంచే రూ.24.59 కోట్ల లోటు బడ్జెట్‌తోనే ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించింది. బ్రిటిష్ పాలకులు దేశ సంపదను దోచుకెళ్లగా, స్వాతంత్య్రం అనంతరం భారత్‌కు మిగిలింది అప్పులు, సమస్యలు, సవాళ్లే. అప్పట్లో దేశ రక్షణే అతిపెద్ద సవాలుగా నిలిచింది. అందుకే తొలి బడ్జెట్‌లో సింహభాగం నిధులను రక్షణ రంగానికే కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో దాదాపు 47శాతం, అంటే రూ.92.74కోట్లను డిఫెన్స్ ఖర్చుల కోసం కేటాయించడం గమనార్హం.
Details
బ్రిటిష్ పాలన కాలం నుంచే వాడుకలో 'బడ్జెట్'
ఇంకొక ఆసక్తికర అంశం ఏమిటంటే... 1947లో దేశం విడిపోయినప్పటికీ, 1948 సెప్టెంబర్ వరకు భారత్, పాకిస్థాన్ రెండూ ఒకే కరెన్సీని వినియోగించాయి. ఆ తర్వాతే పాకిస్థాన్ తన సొంత కరెన్సీని ముద్రించుకుంది. అలాగే ఆ కాలంలో సంస్థానాల విలీనం పూర్తిగా జరగలేదు. ఈ నేపథ్యంలోనే 1949-50 ఆర్థిక సంవత్సరంలో జాన్ మథాయ్ తొలి పూర్తిస్థాయి ఉమ్మడి భారత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగంలోని 112వ అధికరణ ప్రకారం బడ్జెట్‌ను 'వార్షిక ఆర్థిక నివేదిక'గా పిలుస్తారు. అయితే 'బడ్జెట్' అనే పదం మాత్రం బ్రిటిష్ పాలన కాలం నుంచే భారతదేశంలో వాడుకలో ఉంది. భారత్‌లో తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్ 7న జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టడం కూడా చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం.
Details
నేడు లక్షల కోట్లు
ఆనాటి రూ.171 కోట్ల బడ్జెట్ నుంచి నేటి లక్షల కోట్ల బడ్జెట్ వరకు భారత్ సాగించిన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. దేశం తీవ్ర సంక్షోభాల్లో ఉన్నా, అప్పటి ఆర్థిక మంత్రులు చూపిన ధైర్యం, దూరదృష్టి వల్లే ఈనాడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలవగలిగింది.