India's forex reserves: వరుసగా రెండవ వారం పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు.. ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) మరోసారి పెరిగాయి. డిసెంబర్ 12తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 1.68 బిలియన్ డాలర్లు పెరిగి 688.94 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. ఈ పెరుగుదలకు ప్రధానంగా బంగారం నిల్వలు భారీగా పెరగడం, అలాగే విదేశీ కరెన్సీ ఆస్తుల్లో స్వల్ప లాభాలు కారణమయ్యాయి. ఫారెక్స్ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (FCAలు)ఈ వారంలో 0.91 బిలియన్ డాలర్లు పెరిగి 557.79 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో డాలర్‌తో పోలిస్తే యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర కరెన్సీల విలువల్లో మార్పుల ప్రభావం కూడా ఉంటుందని ఆర్బీఐ వివరించింది.
వివరాలు
బంగారం నిల్వలు 0.76 బిలియన్ డాలర్లు పెరిగి 107.74 బిలియన్ డాలర్లకు
అదే సమయంలో బంగారం నిల్వలు 0.76 బిలియన్ డాలర్లు పెరిగి 107.74 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆస్తులను విభిన్నంగా పెట్టుబడి పెట్టే వ్యూహంలో భాగంగా బంగారం నిల్వలను ఆర్బీఐ పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) వద్ద ఉన్న ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDRలు) స్వల్పంగా 0.01 బిలియన్ డాలర్లు పెరిగి 18.74 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే IMFలో భారత్‌కు ఉన్న రిజర్వ్ పొజిషన్ కూడా 0.01 బిలియన్ డాలర్లు పెరిగి 4.69 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే డిసెంబర్ 5తో ముగిసిన గత వారంలో భారత్ ఫారెక్స్ నిల్వలు సుమారు 1.03 బిలియన్ డాలర్లు పెరిగి 687.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వివరాలు
పెరిగిన భారత్‌కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
ఆ సమయంలో బంగారం నిల్వలు 1.188 బిలియన్ డాలర్లు పెరిగి 106.984 బిలియన్ డాలర్లకు,SDRలు 93 మిలియన్ డాలర్లు పెరిగి 18.721 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ అప్పట్లో వెల్లడించింది. విదేశీ మారక మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలను ఆర్బీఐ నిరంతరం గమనిస్తున్నట్లు, అవసరమైన సందర్భాల్లో జోక్యం చేసుకుని మార్కెట్‌లో అనవసర ఒడిదుడుకులు లేకుండా చూస్తామని కేంద్ర బ్యాంక్ మరోసారి స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా,ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) గణనీయంగా పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో దేశానికి వచ్చిన FDI 50.36 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16 శాతం వృద్ధి కావడం విశేషం.
వివరాలు
బలంగా పుంజుకున్న FDI
ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఇదే అత్యధిక FDI ప్రవాహం అని ఈ నెల ప్రారంభంలో పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం,దేశంలోకి వచ్చే మొత్తం FDI ప్రవాహం 2012-13లో 34 బిలియన్ డాలర్ల నుంచి, 2024-25 నాటికి 80 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో కూడా FDI బలంగా పుంజుకుంది. ఏప్రిల్-సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో పెట్టుబడులు 18 శాతం కంటే ఎక్కువగా పెరిగి 35.18 బిలియన్ డాలర్లకు చేరాయి.
వివరాలు
భారత్ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందిస్తోంది
పెట్టుబడుల ఉపసంహరణ (రిపాట్రియేషన్) పెరుగుతున్న ధోరణి చూస్తే, భారత్ కేవలం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దీని వల్ల భారత్ ఒక నమ్మకమైన పెట్టుబడి గమ్యస్థానంగా తన ప్రతిష్ఠను మరింత బలోపేతం చేసుకుంటోంది. అదే సమయంలో, ఎగుమతులను విస్తరించేందుకు, ముఖ్య రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు)ను కూడా వినియోగిస్తోందని అధికారులు తెలిపారు.