2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా
ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్&పీ(S&P) తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటుపై కీలక అంశాలను పొందుపర్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం, అసాధారణ రుతుపవనాల ప్రమాదం, వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6% వద్ద కొనసాగించిందని ఎస్&పీ అంచనా వేసింది. ఆర్థిక రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను అంతకుముందు 5శాతంగా పేర్కొన్న రేటింగ్స్ సంస్థ దాన్ని 5.5శాతానికి సవరించింది. 2023ఆర్థిక సంవత్సరంలో Q4లో భారత జీడీపీ 4.2% వృద్ధి చెందినట్లు ఎస్&పీకి చెందిన ఎకనామిక్ ఔట్‌లుక్ ఫర్ ఆసియా పసిఫిక్ వెల్లడించింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 7.8శాతం అధికం కావడం గమనార్హం.
వచ్చే రెండేళ్లకు 6.9శాతంగా వృద్ధి రేటు అంచనా
జూన్ త్రైమాసికంలో భారతదేశం బలమైన వినియోగ వృద్ధి, మూలధన వ్యయం భారత వృద్ధి రేటు మెరగవడానికి దోహదపడినట్లు ఎస్&పీ అభిప్రాయపడింది. అలాగే 2025, 2026 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వృద్ధ రేట్లను కూడా ఎస్&పీ అంచనా వేసింది. రెండు సంవత్సరాలకు 6.9శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. ఇదిలా ఉంటే, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సెప్టెంబరులో భారతదేశానికి ఇచ్చిన జీడీపీ వృద్ధి అంచనాను సవరించింది. మొదట దీన్ని 5.9శాతం ఇవ్వగా, ఇప్పుడు 6.2శాతానికి సవరించింది. FY23లో భారత్ 7.2% వృద్ధి రేటును సాధించింది. వాస్తవానికి ఆర్‌బీఐ 7శాతం మాత్రమే అంచనా వేయగా, దాన్ని అధిగమించింది. అయినప్పటికీ వృద్ధి రేటు FY22తో పోలిస్తే క్షీణించింది.