LOADING...
Retail Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి దేశీయ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో 3.48 శాతం నమోదు
నాలుగు నెలల గరిష్ఠానికి దేశీయ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో 3.48 శాతం నమోదు

Retail Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి దేశీయ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో 3.48 శాతం నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుదల దిశగా సాగుతోంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరిందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. మార్చిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. వరుసగా ఆహార ధరలు పెరగడం వల్లే ద్రవ్యోల్బణం అధికమైందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా వినియోగదారుల ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో నమోదైన 3.87 శాతం నుంచి ఏప్రిల్‌లో 4.2 శాతానికి పెరిగింది. ఇది గత నాలుగు నెలల్లో అత్యధిక స్థాయిగా గుర్తించారు. దీంతో దేశ ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశించిన మధ్యకాల లక్ష్యమైన 4 శాతానికి మరింత చేరువైంది.

వివరాలు 

ఇంధన ధరలు కూడా ద్రవ్యోల్బణానికి ముప్పుగా మారే అవకాశం 

ఇక అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. ఏడాది చివర్లో ఎల్‌నినో ప్రభావం పెరిగితే వ్యవసాయ ఉత్పత్తి, ఆహార సరఫరాపై ప్రతికూల ప్రభావం పడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇంధన ధరలు కూడా ద్రవ్యోల్బణానికి ముప్పుగా మారే అవకాశముంది. ఏప్రిల్‌లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 114 డాలర్ల వరకు చేరగా, మే నెలలో సగటున 105 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

ఏప్రిల్ 8న జరిగిన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లు యథాతథం

అయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా, ఇప్పటివరకు వాటి భారం వినియోగదారులపై మోపకుండా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు కొనసాగిస్తోంది. దీంతో ద్రవ్యోల్బణంపై కొంత నియంత్రణ సాధ్యమైంది. కానీ భవిష్యత్తులో ఇంధన ధరలను పెంచితే రవాణా వ్యయాలు, సరుకు రవాణా ఖర్చులు పెరిగి ఆహార వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 8న జరిగిన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. కీలక రెపో రేటును 5.25 శాతంగా కొనసాగిస్తూ తటస్థ విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

Advertisement