India Stock Market: ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించిన భారత్
భారత స్టాక్ మార్కెట్ సరికొత్త మైలు రాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది. భారతీయ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన స్టాక్‌ల సంయుక్త విలువ సోమవారం 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో హాంకాంగ్(4.29 ట్రిలియన్ డాలర్లు)ను అధిగమించి.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. డిసెంబర్ 5న తొలిసారిగా దేశీయ మార్కెట్ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఇందులో దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు గత నాలుగేళ్లలో వచ్చాయి. వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్, బలమైన కార్పొరేట్ ఆదాయాల కారణంగా భారతదేశంలో ఈక్విటీలు వేగంగా పెరుగుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనాకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు భారత్ కనపడుతోంది. ఫలితంగా భారత మార్కెట్ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులు, కంపెనీల నుంచి మూలధనాన్ని ఆకర్షించడంలో సఫలీకృతమవుతోంది. సుస్థిర రాజకీయ వాతావరణం కూడా భారత మార్కెట్ పెరగడానికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ల పతనం కూడా భారత మార్కెట్ పురోగమించడానికి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కొన్ని హాంకాంగ్‌లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. కరోనావైరస్ ఆంక్షలు, సంక్షోభం, పశ్చిమ దేశాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అభివృద్ధి రథం ఆగిపోయింది. ఫలితంగా చైనా స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఆ ప్రభావం హాంకాంగ్ స్టాక్‌లను కుప్పకూలేలా చేసింది.