India's Top 10 Philanthropists: దాతృత్వంలో శివనాడార్,ముఖేష్ అంబానీలు టాప్.. టాప్ 10 జాబితాలో ఎవరెవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని సంపన్న కుటుంబాలు ఇప్పుడు దాతృత్వ సేవల్లో మరింత చురుకుగా మారుతున్నాయి. EdelGive Hurun India Philanthropy List 2025 ప్రకారం,2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ప్రముఖ దాతలు కలిపి మొత్తం ₹10,380 కోట్లు విరాళంగా అందించారు. ఇది మూడు సంవత్సరాల క్రితం తో పోలిస్తే 85% పెరుగుదల గా నమోదు అయింది. EdelGive ఫౌండేషన్,హురున్ రిపోర్ట్ ఇండియా కలిసి విడుదల చేసిన ఈ జాబితాలో, మొత్తం 191 మంది దాతలు చోటు దక్కించుకున్నారు. అందులో 12 మంది కొత్తగా ఈ జాబితాలోకి ప్రవేశించారు. ప్రతి ఒక్కరు ఈ ఏడాది కనీసం ₹5 కోట్లు కంటే ఎక్కువ విరాళం అందించారు.
వివరాలు
శివనాడార్
మరింత ముఖ్యంగా,₹100 కోట్లు కంటే ఎక్కువ విరాళం ఇస్తున్న భారతీయుల సంఖ్య 2018లో కేవలం ఇద్దరుగా ఉండగా,ఇప్పుడు 2025 నాటికి ఆ సంఖ్య 18 మందికి చేరింది. ఇది దేశంలో పెద్ద మొత్తంలో దానం చేయాలనే అవగాహన,బాధ్యతా భావం పెరుగుతోందన్న విషయం స్పష్టంగా చూపిస్తోంది. దేశంలో దాతృత్వ సేవల్లో ముందుండే కుటుంబాల జాబితాలో ఈసారి కూడా శివనాడార్ కుటుంబం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివనాడార్,అయన కుటుంబం ఈ ఏడాది ₹2,708 కోట్లు విరాళంగా ఇవ్వగా, ఇది రోజుకు సుమారు ₹7.4కోట్లు అవుతుంది.గత ఐదు సంవత్సరాల్లో మొత్తం ₹10,122 కోట్లు విరాళాలు అందజేశారు. అయన విరాళాల్లో ఎక్కువ భాగం విద్యాభివృద్ధి కోసం శివనాడార్ ఫౌండేషన్ ద్వారా ఖర్చు అవుతోంది.
వివరాలు
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేష్ అంబానీ
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేష్ అంబానీ, కుటుంబం ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరంలో అయన వార్షిక విరాళం ₹626 కోట్లు, అంటే రోజుకి సుమారు ₹1.7 కోట్లు వస్తుంది. గత ఐదేళ్లలో అయన ₹2,855 కోట్లు విరాళంగా అందించారు. ఇవి ఎక్కువగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక సేవలకే వినియోగించబడుతున్నాయి.
వివరాలు
బజాజ్
బజాజ్ కుటుంబం ఈ సంవత్సరం ₹446 కోట్లు (రోజుకి ₹1.2 కోట్లు) విరాళంగా ఇచ్చింది. ఐదు సంవత్సరాల్లో మొత్తం ₹1,350 కోట్లు విద్య కోసం బజాజ్ ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా అందించారు. అదిత్య బిర్లా గ్రూప్ అదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ ఏడాది ₹440 కోట్లు విరాళం ఇవ్వగా, ఐదు సంవత్సరాల్లో మొత్తం ₹1,936 కోట్లు ఇచ్చారు. అయన విరాళాలు ఎక్కువగా ఆరోగ్య సేవల రంగానికే వినియోగించబడుతున్నాయి. గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ, కుటుంబం అదానీ ఫౌండేషన్ ద్వారా ₹386 కోట్లు ముఖ్యంగా విద్యాభివృద్ధి కోసం విరాళం ఇచ్చారు.
వివరాలు
నందన్ నిలేకని
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు,ఆధార్ సిస్టమ్ రూపకర్త నందన్ నిలేకని ఈ సంవత్సరం ₹365 కోట్లు వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు నీలకణి ఫిలాంత్రపీస్ ద్వారా అందించారు. ఐదు సంవత్సరాల మొత్తం విరాళం ₹1,362 కోట్లు. హిందూజా గ్రూప్ హిందూజా గ్రూప్ హిందూజా ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సేవల కోసం ₹298 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఐదు సంవత్సరాల్లో మొత్తం ₹785 కోట్లు ఇచ్చారు. రోహిణి నీలేకని సామాజిక సేవలో రోహిణి నీలేకని కూడా టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది ₹204 కోట్లు, ఐదు సంవత్సరాల్లో మొత్తం ₹763 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆమె నందన్ నిలేకని భార్య.
వివరాలు
టొరెంట్ గ్రూప్
టొరెంట్ గ్రూప్ కు చెందిన కోటీశ్వర సోదరులు సుధీర్ మెహతా, సమీర్ మెహతా సామాజిక అభివృద్ధి కోసం ₹189 కోట్లు విరాళం ఇచ్చారు. ఐదు సంవత్సరాల్లో మొత్తం ₹514 కోట్లు అందించారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కు చెందిన సైరస్ పూనావాల్లా - ఆదార్ పూనావాల్లా తండ్రీకొడుకులు. ₹173 కోట్లు విద్య అభివృద్ధి కోసం విలూ పూనావాల్లా ఫౌండేషన్ ద్వారా అందించారు. ఐదు సంవత్సరాల్లో వీరి మొత్తం దానం ₹730 కోట్లు.