LOADING...
India-China Trade: చైనాతో భారత వాణిజ్య లోటు రికార్డు స్థాయికి: జీటీఆర్‌ఐ హెచ్చరిక
చైనాతో భారత వాణిజ్య లోటు రికార్డు స్థాయికి: జీటీఆర్‌ఐ హెచ్చరిక

India-China Trade: చైనాతో భారత వాణిజ్య లోటు రికార్డు స్థాయికి: జీటీఆర్‌ఐ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-చైనా మధ్య వాణిజ్య అంతరం నానాటికీ పెరుగుతోంది ఒకవైపు చైనా నుంచి భారత్‌కు భారీ మొత్తంలో వస్తువులు దిగుమతి అవుతుండగా, మరోవైపు భారత్‌ నుంచి చైనాకు వెళ్లే ఎగుమతులు మాత్రం పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత వాణిజ్య లోటు సుమారు 106 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశముందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) అంచనా వేసింది. ముఖ్యంగా చైనా నుంచి ఎలక్ట్రానిక్స్‌, మెషినరీ, ఆర్గానిక్‌ రసాయనాలు, ప్లాస్టిక్‌కు సంబంధించిన ఉత్పత్తుల దిగుమతులు గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొంది.

వివరాలు 

జీటీఆర్‌ఐ నివేదికలో వెల్లడైన ముఖ్యమైన అంశాలు ఇవి:

2021లో భారత్‌కు చైనా నుంచి వచ్చిన దిగుమతుల విలువ 87.7బిలియన్‌ డాలర్లు కాగా,అది గత ఏడాదికి 109.6 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2025 నాటికి ఈ దిగుమతుల విలువ మరింతగా పెరిగి 123.5బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, 2021లో భారత్‌ నుంచి చైనాకు జరిగిన ఎగుమతుల విలువ 23 బిలియన్‌ డాలర్లుగా ఉండగా,గత ఏడాదికి అది 15.1 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. 2025లో ఈ ఎగుమతుల విలువ స్వల్పంగా పెరిగి 17.5 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని జీటీఆర్‌ఐ భావిస్తోంది. అయినప్పటికీ, ఇది గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువ స్థాయిలోనే ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఎగుమతులు తగ్గుతుండటంతో చైనాతో భారత వాణిజ్య లోటు భారీగా పెరుగుతోంది.

వివరాలు 

ఈ ఏడాది ఈ లోటు మరింత పెరిగి 106 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం

2021లో 64.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య అంతరం,గత ఏడాది 94.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఈ లోటు మరింత పెరిగి 106 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య కాలంలో చైనా నుంచి భారత్‌కు అత్యధికంగా దిగుమతి అయినవి ఎలక్ట్రానిక్స్‌ సంబంధిత ఉత్పత్తులే. వీటి మొత్తం విలువ 38 బిలియన్‌ డాలర్లకు మించి ఉంది. ఇందులో మొబైల్‌ ఫోన్‌ భాగాలు (8.6 బిలియన్‌ డాలర్లు), ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌ (6.2 బిలియన్‌ డాలర్లు), ల్యాప్‌టాప్‌లు (4.5 బిలియన్‌ డాలర్లు), అలాగే సోలార్‌ సెల్స్‌, లిథియం-అయాన్‌ బ్యాటరీలు వంటి ఉత్పత్తులు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

భారత్‌ నుంచి చైనాకు 2.2 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి

ఇక, నవంబర్‌ నెలలో మాత్రమే భారత్‌ నుంచి చైనాకు 2.2 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు మొత్తం ఎగుమతుల విలువ 12.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ప్లాస్టిక్‌ పరిశ్రమలో వినియోగించే నాఫ్తా ఎగుమతులు పెరగడం వల్ల, ఈ ఏడాది చైనాకు మన దేశం నుంచి వెళ్లిన ఎగుమతుల విలువ స్వల్పంగా పెరిగిందని జీటీఆర్‌ఐ తన నివేదికలో పేర్కొంది.

Advertisement