SBI: యువతకు జాబ్స్ పెరుగుతున్నాయా?.. ఎస్‌బీఐ రిపోర్ట్ ఏమంటోంది
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో నగర ప్రాంతాల యువత నిరుద్యోగం క్రమంగా తగ్గుతూ వస్తోందని తాజా ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2025లో 15-24 ఏళ్ల యువత నిరుద్యోగ రేటు 9.9 శాతంగా నమోదై, ప్రపంచ సగటు 12.6 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది. పీఎల్ఎఫ్ఎస్ (PLFS) 2025 డేటా ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, 2022లో 10.9 శాతంగా ఉన్న యువ నిరుద్యోగం 2024లో 10.3 శాతానికి, 2025లో 9.9 శాతానికి తగ్గింది.
వివరాలు
30 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం చాలా తక్కువ
గ్లోబల్ స్థాయిలో యువతకు ఉద్యోగ అవకాశాలు సవాళ్లుగా ఉన్నప్పటికీ, భారత్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని పేర్కొంది. 30 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం చాలా తక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని సూచిస్తోందని ఎస్‌బీఐ విశ్లేషించింది. ముఖ్యంగా తయారీ, వ్యవసాయేతర రంగాల్లో పెరుగుతున్న ఉద్యోగాలు, రాష్ట్రాల వారీగా ఆర్థిక విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు దేశంలో కార్మిక మార్కెట్ పరిస్థితులను మెరుగుపరుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.