Spectrum Auction: నేడు రూ.96,317.65 కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి సిద్దమైన భారతదేశం
టెలికాం డిపార్ట్‌మెంట్ ఎనిమిది బ్యాండ్‌లలో రూ.96,000 కోట్లకు పైగా విలువైన స్పెక్ట్రమ్‌లను నేటి నుంచి వేలం వేయనుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా 5G మొబైల్ సేవల కోసం ఈ ముఖ్యమైన రేడియో ఫ్రీక్వెన్సీలను పొందాలని చూస్తున్నాయి. చివరి స్పెక్ట్రమ్ వేలం ఆగస్ట్ 2022లో జరిగింది. ఇందులో 5G సేవల కోసం రేడియో ఫ్రీక్వెన్సీలు మొదటిసారిగా చేర్చారు.
జూన్ 6న జరగాల్సిన స్పెక్ట్రమ్ వేలం తేదీ వాయిదా
టెలికాం శాఖ స్పెక్ట్రమ్ వేలం గడువును 19 రోజులు పొడిగించింది. ముందుగా ఈ స్పెక్ట్రమ్ వేలం జూన్ 6న జరగాల్సి ఉండగా, జూన్ 5న ఈ ప్రత్యక్ష వేలం ప్రారంభ తేదీని జూన్ 6 నుంచి జూన్ 25కి మార్చారు. టెలికాం శాఖ ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను వేలం వేయనుంది మొబైల్ ఫోన్ సేవల కోసం ప్రభుత్వం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను సుమారు రూ.96,317 కోట్ల బేస్ ధరతో వేలం వేయనుంది. 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్‌లలో లభించే స్పెక్ట్రమ్ మొత్తం 10వ వేలంలో భాగమే కావడం గమనార్హం.
20 ఏళ్లపాటు స్పెక్ట్రమ్ ఇస్తారు
స్పెక్ట్రమ్ 20 సంవత్సరాల కాలానికి ఇస్తారు, విజయవంతమైన బిడ్డర్లు 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లింపు చేసే సౌకర్యం ఉంటుంది. కనీసం 10 సంవత్సరాల తర్వాత రాబోయే వేలం ద్వారా అందుకున్న స్పెక్ట్రమ్‌ను తిరిగి ఇచ్చే అవకాశాన్ని టెలికాం డిపార్ట్‌మెంట్ ఇచ్చింది.
రిలయన్స్ జియో అత్యధిక మొత్తాన్ని డిపాజిట్ చేసింది
స్పెక్ట్రమ్ వేలం కోసం రిలయన్స్ జియో గరిష్టంగా 3000 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసింది. దీని ఆధారంగా కంపెనీ రేడియో ఫ్రీక్వెన్సీ కోసం అత్యధికంగా వేలం వేయవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకారం, భారతీ ఎయిర్‌టెల్ రూ. 1050 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ. 300 కోట్లు డిపాజిట్ చేశాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలను తగ్గించుకోవడానికి ముఖ్యంగా 26 GHz బ్యాండ్‌లో వ్యూహాత్మక కొనుగోళ్లపై దృష్టి పెట్టవచ్చు.