Sergio Gor: క్రిటికల్ మినరల్స్ డీల్‌కు రంగం సిద్ధం.. త్వరలో భారత్-అమెరికా చర్చలు : యూఎస్ రాయబారి కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో తాజాగా మరో ముఖ్యమైన ప్రకటన వెలువడింది. భారత్,అమెరికా మధ్య త్వరలోనే క్రిటికల్ మినరల్స్ ఒప్పందం (US-India Critical Minerals Deal) కుదిరే అవకాశముందని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ (US Ambassador Sergio Gor) వెల్లడించారు. ఆయన ఈ వ్యాఖ్యలను ఇండియాటుడే కాంక్లేవ్ 2026 కార్యక్రమంలో వెల్లడించారు.
వివరాలు
క్రిటికల్ మినరల్స్ ప్రధాన పాత్ర
ఈ సందర్భంగా సెర్గియో గోర్ మాట్లాడుతూ, భారత్-అమెరికా ద్వైపాక్షిక సహకారంలో కీలకమైన రంగాలలో క్రిటికల్ మినరల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ముఖ్యమైన ఖనిజాలకు స్థిరమైన, విశ్వసనీయ సరఫరా గొలుసులు ఉండటం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా జాతీయ భద్రతకు కూడా అత్యంత అవసరమని ఆయన అన్నారు. అధునాతన తయారీ రంగం, ఇంధన వ్యవస్థలు, సాంకేతికత అభివృద్ధి వంటి పలు రంగాల్లో ఈ ఖనిజాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య త్వరలోనే ఈ అంశంపై ప్రత్యేక ఒప్పందం కుదరనుందని వెల్లడించారు.
వివరాలు
వచ్చే నెలలో సంతకాలు జరిగే అవకాశం
ఇదే సందర్భంలో భారత్-అమెరికాల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (US-India Trade Deal) గురించిన అంశాన్ని కూడా అమెరికా రాయబారి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధం వల్ల ఈ ట్రేడ్ డీల్ సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందంపై వచ్చే నెలలో సంతకాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే భారత తయారీ రంగాలకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశాలు లభించే అవకాశం ఉందని సమాచారం.