wholesale inflation: ఇంధన ధరల ఎఫెక్ట్.. 8.3%కి దూసుకెళ్లిన టోకు ద్రవ్యోల్బణం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో టోకు ద్రవ్యోల్బణం మరోసారి భారీగా పెరిగింది. ఏప్రిల్ నెలలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 8.3 శాతానికి చేరిందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. మార్చిలో ఇది 3.88 శాతంగా ఉండగా, ఒక్క నెలలోనే భారీ ఎత్తున పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ నిపుణులు 4.4 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేయగా, వాస్తవ గణాంకాలు వాటికంటే చాలా ఎక్కువగా నమోదయ్యాయి. 2022 అక్టోబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ప్రధానంగా ఇంధన, విద్యుత్ విభాగాల్లో ధరలు ఒక్కసారిగా పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం భారీగా ఎగిసింది. ఫ్యూయల్ అండ్ పవర్ కేటగిరీలో ద్రవ్యోల్బణం మార్చిలో 1.05 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో అది 24.71 శాతానికి చేరింది.
వివరాలు
ప్రధాన కారణాలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, సరఫరా అనిశ్చితి దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ముడి చమురు, సహజవాయువు ధరలు 67.18 శాతం పెరిగాయి.పెట్రోల్ ధరలు 32.4 శాతం, డీజిల్ ధరలు 25.19 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ప్రభావంతో భారత్‌లో కూడా ఏటీఎఫ్ (విమాన ఇంధనం), కమర్షియల్ ఎల్‌పీజీ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో విమాన ఇంధనం ధరలు 8.6 శాతం, కమర్షియల్ ఎల్‌పీజీ ధరలు 10.4 శాతం పెరిగాయి.
వివరాలు
పారిశ్రామిక, వాణిజ్య రంగాలపై అదనపు భారం
భారత్‌కు అవసరమైన ముడి చమురులో దాదాపు 90 శాతం, ఎల్‌పీజీలో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటం వల్ల అంతర్జాతీయ ధరల మార్పులు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో రవాణా సమస్యలు, షిప్పింగ్ రిస్క్‌లు కూడా సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. గృహ వినియోగ ఎల్‌పీజీ ధరలను స్థిరంగా ఉంచినా, పారిశ్రామిక, వాణిజ్య రంగాలపై అదనపు భారం పడింది. ఇక రూపాయి విలువ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇటీవల వరుసగా కనిష్ఠ స్థాయిలను తాకింది.
వివరాలు
ఇంధనంతో పాటు తయారీ రంగంపైనా ధరల ప్రభావం
ఆహార ద్రవ్యోల్బణం మాత్రం స్వల్పంగా మాత్రమే పెరిగింది. మార్చిలో 1.85 శాతంగా ఉన్న ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ఏప్రిల్‌లో 2.31 శాతానికి చేరింది. కూరగాయల ధరల్లో కొంత మార్పులు కనిపించినప్పటికీ పెద్ద ఎత్తున పెరుగుదల నమోదు కాలేదు. ఇంధనంతో పాటు తయారీ రంగంపైనా ధరల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల మార్చిలో 3.39 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 4.62 శాతానికి పెరిగింది. ముఖ్యంగా రసాయనాలు, వస్త్రాలు, బేసిక్ మెటల్స్ ధరలు పెరగడంతో పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు అధికమయ్యాయి. బేసిక్ మెటల్స్ ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరగా, కెమికల్స్ విభాగంలో 5.09 శాతం పెరుగుదల నమోదైంది.