Indian airlines: పెరుగుతున్న ఇంధన ధరలు.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ కీలక వినతి
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. దేశీయ విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కీలక విజ్ఞప్తి చేశాయి. దేశీయ విమానాల కోసం ఉపయోగించే జెట్ ఇంధన ధరలను ప్రస్తుతం పెంచవద్దని కోరాయి. ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటు నష్టాలు కూడా అధికమవుతున్నాయని ఎయిర్‌లైన్స్ పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ప్రధాన విమానయాన సంస్థలు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ రిఫైనరీ సంస్థలు చర్చిస్తున్నాయి.
వివరాలు
విమాన ఇంధన ధరలను ప్రతి నెల మొదటి తేదీన సవరించడం ఆనవాయితీ
కేంద్ర పెట్రోలియం శాఖ కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. జూన్ 1కి ముందు దీనిపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో విమాన ఇంధన ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన సవరించడం ఆనవాయితీ. అయితే ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో ఏప్రిల్‌లో జెట్ ఫ్యూయల్ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం 25 శాతానికి పరిమితం చేసింది. మే నెలలో ధరలను స్థిరంగా ఉంచాలని కూడా సూచించింది. ప్రస్తుతం దేశీయ విమానాల కోసం కిలోలీటర్ జెట్ ఇంధనాన్ని సుమారు రూ.1.05 లక్షలకు విక్రయిస్తున్న ఆయిల్ కంపెనీలు.. ప్రతి కిలోలీటర్‌పై రూ.92 వేల వరకు నష్టపోతున్నట్లు సమాచారం.
వివరాలు
40 శాతం వరకు ఇంధన ఖర్చులే
జూన్‌లో ధరలను మరో 25 శాతం వరకు పెంచే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. భారత్‌లో ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40 శాతం వరకు ఇంధన ఖర్చులే ఉంటాయి. ఇప్పటికే పెరిగిన టికెట్ ధరల కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిందని, కొన్ని సంస్థలు విమాన సర్వీసులను కూడా తగ్గిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడంతో విదేశీ చెల్లింపుల భారం కూడా పెరిగింది.
వివరాలు
పెరిగిన డీజిల్,పెట్రోల్ ధరలు
ఇక మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ విమానాలపైనా పడుతోంది. పాకిస్థాన్ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడంతో యూరప్, అమెరికా వెళ్లే విమానాలు ఇరాన్ గగనతలాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో అదనపు ఖర్చులు పెరిగి వాటిని టికెట్ ధరల రూపంలో ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు డీజిల్, పెట్రోల్ ధరలను గత వారం తర్వాత మరోసారి పెంచాయి. ఢిల్లీలో మంగళవారం డీజిల్, పెట్రోల్ ధరలను 1 శాతం మేర పెంచగా.. గత శుక్రవారం 3 శాతం పెంపు చేశారు.