Tata Steel: చైనా ఉక్కు ఎగుమతులతో భారత పరిశ్రమకు ముప్పు.. టాటా స్టీల్ సీఈవో కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
చైనా నుంచి పెరుగుతున్న ఉక్కు ఎగుమతులు భారతీయ ఉక్కు పరిశ్రమకు ముప్పుగా మారుతున్నాయని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ హెచ్చరించారు. భారీ పెట్టుబడులతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న దేశీయ తయారీ సంస్థలకు చైనా నుంచి వస్తున్న మిగులు ఉక్కు ఎగుమతుల వల్ల అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. చైనా ప్రతి నెలా 10 మిలియన్ టన్నులకు పైగా ఉక్కును ఎగుమతి చేస్తోందని, ఈ ఏడాది ఆ ఎగుమతులు 130 మిలియన్ టన్నులకు చేరవచ్చని నరేంద్రన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు దిగుమతులపై పరిమితులు విధించడం ద్వారా ప్రభుత్వం దేశీయ పరిశ్రమకు మద్దతుగా నిలిచిందని చెప్పారు.
వివరాలు
ఉక్కు ఎగుమతుల ముప్పు నిరంతరం కొనసాగుతోంది
అయినప్పటికీ చైనా ఉక్కు ఎగుమతుల ముప్పు నిరంతరం కొనసాగుతోందని వివరించారు.
ప్రపంచంలోని అనేక మార్కెట్లు, దేశాలు చైనా నుంచి వస్తున్న మిగులు ఉక్కుతో ప్రభావితమవుతున్నాయని ఆయన అన్నారు.
దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న భారత పరిశ్రమపై చైనా ఉక్కు ఎగుమతుల ప్రభావం పడకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
50 మిలియన్ టన్నులకు టాటా స్టీల్ లక్ష్యం?
మరోవైపు టాటా స్టీల్ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపైనా టీవీ నరేంద్రన్ కీలక వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 40 మిలియన్ టన్నులకు (MTPA) పెంచుకునే అవకాశం కంపెనీకి ఉందని తెలిపారు.
భవిష్యత్తులో అవసరమైతే 50 మిలియన్ టన్నుల స్థాయికి కూడా విస్తరించవచ్చని పేర్కొన్నారు.
అయితే ఈ విస్తరణ నిర్ణయాలు కంపెనీ పెట్టుబడి ప్రాధాన్యతలు, దేశీయంగా ఇనుప ఖనిజం ధరలు, డౌన్‌స్ట్రీమ్ వ్యాపారాలపై దృష్టి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని నరేంద్రన్ వివరించారు.