Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
ఈ వార్తాకథనం ఏంటి
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో ముడి చమురు ధరల పెరుగుదల,భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో భారీ నష్టాలు ఎదుర్కొన్న సూచీలు,ఈరోజు ఆ ప్రభావం నుంచి కొంత మేర కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, రూపాయి విలువ బలపడటం వంటి అంశాలు ఉదయం ట్రేడింగ్‌లో మార్కెట్లకు మంచి ఊతాన్ని అందించాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా, నిఫ్టీ 140 పాయింట్లకుపైగా లాభపడింది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు తమ లాభాల్లో చాలా భాగాన్ని కోల్పోయాయి. అయినప్పటికీ చివరకు రెండు ప్రధాన సూచీలు పచ్చబాటలోనే ముగిశాయి.
వివరాలు
ప్రాఫిట్ బుకింగ్ పెరగడంతో క్షిణించిన మార్కెట్లు
బీఎస్‌ఈ సెన్సెక్స్ గత ముగింపు 77,054.94తో పోలిస్తే 130.49పాయింట్లు లేదా 0.17శాతం పెరిగి 77,185.43 వద్ద స్థిరపడింది.
అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 సూచీ గత ముగింపు 24,052.05తో పోలిస్తే 26.45 పాయింట్లు లేదా 0.11శాతం లాభపడి 24,078.50 వద్ద ముగిసింది.
ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,192.76,నిఫ్టీ 24,085.85 వద్ద లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో సెన్సెక్స్ 77,646.27పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకోగా,నిఫ్టీ 24,220.35పాయింట్లను తాకింది.
అనంతరం మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో ప్రాఫిట్ బుకింగ్ పెరగడంతో మార్కెట్లు ఒక్కసారిగా క్షీణించాయి.
ఈ క్రమంలో నిఫ్టీ ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 24,010.55కు పడిపోగా,సెన్సెక్స్ 76,982.82 వరకు దిగజారింది.
అనంతరం కొనుగోళ్లు తిరిగి పెరగడంతో సూచీలు కొంత కోలుకుని లాభాలతోనే ముగిశాయి.
వివరాలు
టాప్ గెయినర్స్
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల షేర్లు మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచాయి.
ముఖ్యంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలతో ట్రేడయ్యాయి.
టాప్ లూజర్స్
మరోవైపు ఐటీ, మెటల్ రంగాల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
వివరాలు
మార్కెట్ పుంజుకోవడానికి ప్రధాన కారణాలు
1. రూపాయి బలోపేతం: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గత సెషన్‌లో నమోదైన పతనం నుంచి కోలుకుని స్థిరపడటంతో మార్కెట్ సెంటిమెంట్‌కు బలం చేకూరింది.
2. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు: అమెరికా స్టాక్ మార్కెట్లలో నమోదైన అనుకూల ధోరణి, ఆసియా మార్కెట్లలో కనిపించిన సానుకూల ట్రెండ్ దేశీయ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.
3. హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు తగ్గుముఖం: పశ్చిమాసియాలో రవాణా సుంకాలకు సంబంధించిన ఆందోళనలు కొంత తగ్గడం, అలాగే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 85 డాలర్ల సమీపానికి స్వల్పంగా తగ్గడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు తగ్గి మార్కెట్‌కు ఉపశమనం లభించింది.