Stock Market: ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 479 పాయింట్ల జంప్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సూచనల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం తీవ్ర మార్పులకు లోనయ్యాయి. ప్రారంభంలో లాభాల దిశగా సాగిన సూచీలు కొద్దిసేపటికే గణనీయమైన నష్టాల్లోకి జారాయి. అనంతరం తిరిగి కోలుకుని చివరకు లాభాలతోనే ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు జాగ్రత్త వైఖరిని అవలంబించారు. అయినప్పటికీ ఆటో,ఎఫ్‌ఎమ్‌సీజీ,పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో నమోదైన కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. ఫలితంగా రోజంతా ఊగిసలాటకు గురైన సూచీలు చివరికి పాజిటివ్‌గా నిలిచాయి. గత సెషన్‌లో 82,814వద్ద ముగిసిన సెన్సెక్స్,సోమవారం ఉదయం సుమారు 100పాయింట్ల పెరుగుదలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే ఆ తరువాత ఒత్తిడి పెరగడంతో నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం తర్వాత సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో మళ్లీ పుంజుకుంది.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.88గా నమోదు
ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 500 పాయింట్లకు పైగా రికవరీ సాధించింది. చివరకు 479 పాయింట్ల లాభంతో 83,294 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇదే ధోరణిని అనుసరించిన నిఫ్టీ కూడా చివరికి 141 పాయింట్లు పెరిగి 25,713 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో ఇండియన్ బ్యాంక్, కమిన్స్, సీమన్స్, అదానీ పోర్ట్స్, భారత్ ఫోర్జ్ వంటి షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యూపీఎల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, డిక్సన్ టెక్నాలజీస్, కోఫోర్జ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 92 పాయింట్ల పెరుగుదల చూపించింది.నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 258 పాయింట్లు తగ్గింది. ఇదిలా ఉండగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.88గా నమోదైంది.