India Cement Industry: భారత సిమెంట్ రంగంలో రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ సిమెంట్ పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయమైన వృద్ధి దిశగా సాగుతోంది. గత మూడు సంవత్సరాల్లో సిమెంట్ డిమాండ్ సంవత్సరానికి సగటుగా 9.5 శాతం పెరుగుతోంది. ఈ పెరుగుతున్న గిరాకీని అందిపుచ్చుకునేందుకు అనేక కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. క్రిసిల్ రేటింగ్ సంస్థ అంచనాల ప్రకారం, వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ విస్తరణలకు మొత్తం రూ.1.2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇది గత మూడేళ్ల పెట్టుబడులతో పోలిస్తే దాదాపు 50 శాతం ఎక్కువ.
వివరాలు
2028 మార్చి నాటికి 82.8 నుండి 83.8 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
ఈ విస్తరణలు, కొత్త ప్రాజెక్టుల ద్వారా 2026 నుండి 2028 మధ్య అదనంగా 16-17 కోట్ల టన్నుల గ్రైండింగ్ సామర్థ్యం పెరుగుతుందని క్రిసిల్ తెలిపింది. గత మూడు సంవత్సరాల్లో నమోదైన 9.5 కోట్ల టన్నుల అదనపు సామర్థ్యంతో పోలిస్తే ఇది 75 శాతం అధికం. దీంతో ప్రస్తుతం ఉన్న 66.8 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2028 మార్చి నాటికి 82.8 నుండి 83.8 కోట్ల టన్నుల వరకు పెరగనుందని అంచనా. అయితే ఈ కొత్త సామర్థ్య విస్తరణలో దాదాపు 65 శాతం భాగం ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ప్లాంట్ల విస్తరణ ద్వారానే వస్తుందని, దాంతో పెట్టుబడి వ్యయం అంతగా పెరగదని క్రిసిల్ పేర్కొంది.
వివరాలు
పాజిటివ్ పరిస్థితులు సిమెంట్ రంగానికి ఊపునిస్తున్నాయి
అదనంగా, ఈ పెట్టుబడుల్లో 10 నుండి 15 శాతం వరకు సొంత ఇంధన అవసరాల కోసం హరిత ఇంధన ప్రాజెక్టులు, ఉత్పత్తి ఖర్చులను తగ్గించే కార్యక్రమాలపై వెచ్చించనున్నారు. దీంతో కంపెనీల అప్పు స్థాయిలు స్థిరంగా ఉండి, లాభదాయకతపై కూడా పెద్దగా ప్రభావం ఉండదని క్రిసిల్ స్పష్టం చేసింది. వచ్చే మూడు సంవత్సరాల్లో సిమెంట్ పరిశ్రమకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ రంగాలపై పెరుగుతున్న పెట్టుబడులు ఇందుకు ప్రధాన ప్రేరణగా నిలుస్తున్నాయి. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని అంబుజా సిమెంట్, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ వంటి ప్రముఖ కంపెనీలు భారీ స్థాయిలో విస్తరణ కార్యక్రమాలు చేపట్టాయి.
వివరాలు
70 శాతానికి ఉత్పత్తి సామర్థ్య వినియోగం
కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు, వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చిన్న సిమెంట్ సంస్థలను కూడా ఇవి సొంతం చేసుకుంటున్నాయి. దీంతో 2025 మార్చి నాటికి దేశంలోని మొత్తం 66.8 కోట్ల టన్నుల స్థాపిత సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యంలో సుమారు 85 శాతం 17 ప్రధాన కంపెనీల ఆధీనంలో కేంద్రీకృతమైందని నివేదిక తెలిపింది. గత పదేళ్లుగా సిమెంట్ రంగంలో ఉత్పత్తి సామర్థ్య వినియోగం సగటుగా 65 శాతం వద్ద కొనసాగింది. అయితే డిమాండ్ పెరుగుదల కారణంగా ఇది గత ఆర్థిక సంవత్సరంలో 70 శాతానికి చేరిందని క్రిసిల్ వెల్లడించింది.