Pieter Albers: ఇండిగో విమానయాన సంస్థ కార్యాకలాపాలు సాధారణ స్థితికి..: సీఈఓ వీడియో సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో గత కొన్ని రోజులుగా పరిణమించిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఆ సమస్యలను అధిగమించేందుకు చేపడుతున్న చర్యలు క్రమంగా ఫలితాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం కూడా కొన్ని సర్వీసులు రద్దయినప్పటికీ, మొత్తం కార్యకలాపాలు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా వెల్లడించారు.
వివరాలు
నిన్నటి నుంచి వందకుపైగా గమ్యస్థానాలకు మా విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి: పీటర్
"ప్రస్తుత పరిస్థితుల్లో మా విమానయాన కార్యకలాపాలు సాధారణ స్థాయికి వస్తున్నాయి. పెద్ద పనితీరు వైఫల్యం కారణంగా మా ప్రయాణికులను తీవ్రంగా నిరాశపర్చినందుకు చాలా చింతిస్తున్నాం. లక్షల సంఖ్యలో ఉన్న వినియోగదారులకు ఇప్పటికే రీఫండ్లు అందించాం, మిగిలిన ప్రక్రియను కూడా నిరంతరం కొనసాగిస్తున్నాం. విమానాశ్రయాల్లో నిలిచిపోయిన లగేజీని కస్టమర్ల గృహాల వద్దకు చేరవేశాం. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అన్ని విధాల స్పందిస్తున్నాం. నిన్నటి నుంచి వందకుపైగా గమ్యస్థానాలకు మా విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాం. ఈ సంక్షోభానికి అసలు కారణాలు ఏమిటో గుర్తించే పనిపై ఇప్పటికే దృష్టి సారించాం" అని వీడియో సందేశంలో పీటర్ తెలిపారు.
వివరాలు
అధిక డిమాండ్ ఉన్న కొన్ని మార్గాల్లో విమాన సర్వీసులను కుదింపు
ఇదే సమయంలో, వరుస అంతరాయాలపై కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగానే స్పందించింది. పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న డీజీసీఏ, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంక్షోభానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో ఆదేశించింది. ఇక శీతాకాల సీజన్‌లో ఇండిగో సర్వీసుల సంఖ్య తగ్గనుందని డీజీసీఏ వెల్లడించింది. అధిక డిమాండ్ ఉన్న కొన్ని మార్గాల్లో కూడా విమాన సర్వీసులను కుదించనున్నట్టు స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండిగో సీఈఓ వీడియో సందేశం
IndiGo Operations Normalised | A Message From Pieter Elbers, CEO, IndiGo pic.twitter.com/VVB2yTsIBy
— IndiGo (@IndiGo6E) December 9, 2025