IndiGo: వరుస విమాన రద్దులు.. ఇండిగో షేరు పతనం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో ఇటీవల జరుగుతున్న విమాన రద్దులు, ఆపరేషన్ అడ్డంకుల ప్రభావంతో, దాని మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ విలువ భారీగా తగ్గింది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే సుమారు రూ.25 వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరైపోయినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ డేటా చెబుతోంది. వరుసగా ఆరు రోజుల పాటు షేరు పడిపోతూ మొత్తం 10.6 శాతం నష్టపోయింది. శుక్రవారం ఉదయం 12.14 గంటల సమయంలో ఎన్ఎసిఈలో ఈ షేరు రూ.5,276.5 వద్ద ట్రేడవుతూ, గత రోజు ధరతో పోలిస్తే 2.9 శాతం తగ్గింది. ఈ పరిణామాలతో ప్రయాణికులే కాదు, ఇండిగో షేరు కలిగిన 2.9 లక్షల మందికి పైగా రిటైల్ పెట్టుబడిదారులకూ నష్టమే ఎదురైంది.
వివరాలు
నేడు కూడా ఈ అవస్థలు కొనసాగాయి
నవంబర్ చివరి నుంచే ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తూ వస్తోందని, గత మూడు రోజులుగా పరిస్థితి మరింత తీవ్రమై దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది. సమాచారం కోసం ప్రయాణికులు పరుగులు తీయాల్సి వచ్చి, ప్రయాణ ప్రణాళికలు తారుమారయ్యాయి. నేడు (డిసెంబర్ 5) కూడా ఈ అవస్థలు కొనసాగాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి వరకు అన్ని ఇండిగో విమానాలను రద్దు చేసింది. కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయలేకపోవడమే కారణమని తెలుస్తోంది. అలాగే బెంగళూరులో 102 విమానాలు రద్దవడంతో వందల మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు, పలువురు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సి వచ్చింది.
వివరాలు
ఇండిగో సంస్థకు సిబ్బంది కొరత పెద్ద సమస్య
ఫిబ్రవరి 10 నాటికి తమ కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయని ఇండిగో డీజీసీఏకి తెలిపిందని,పైలట్ల నైట్ డ్యూటీ గంటల పరిమితులపై కొంత సడలింపు కోరినట్లు సమాచారం. డిసెంబర్ 2, 3 తేదీల్లో సుమారు 500 విమానాలను ఇండిగో రద్దు చేసినట్లు మనీకంట్రోల్ రిపోర్టు వెల్లడించింది. ఐదు విమానాల్లో మూడు నడిపే స్థాయిలో ఉన్న ఈ సంస్థకు సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు కారణంగా సిబ్బంది అందుబాటు తగ్గిందని ఇండిగో స్పష్టంచేసింది.
వివరాలు
దేశీయ విమానయాన మార్కెట్లో 65శాతం వాటాతో అతిపెద్ద సంస్థగా ఇండిగో
డిసెంబర్ 4 సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఇండిగో, "గత రెండు రోజుల్లో మా నెట్‌వర్క్ అంతటా విస్తృత అంతరాయాలు చోటుచేసుకున్నాయి. దీని వల్ల ఇబ్బందిపడ్డ మా ప్రయాణికులు, ఇతర భాగస్వాములందరికీ మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. ఆలస్యాల ప్రభావాన్ని తగ్గించి సాధారణ పరిస్థితిని తీసుకురావడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐ, ఎయిర్‌పోర్టు నిర్వాహకుల సహకారంతో మా బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి," అని తెలిపింది. ఈ అంతరాయాలకు ముందు రోజుకు సగటున 2,200 విమానాలు నిర్వహిస్తూ దాదాపు 3.8లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిన ఇండిగో, దేశీయ విమానయాన మార్కెట్లో సుమారు 65 శాతం వాటాతో అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది. అయితే తాజా గందరగోళ పరిణామాలు సంస్థపై నమ్మకానికి పరీక్షగా మారుతున్నాయి.